ప్రజాశక్తి - మొగల్తూరు
వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం సాయంత్రం మొగల్తూరులోని సత్రవపాలెంలో రూ.40 లక్షలతో నిర్మించిన ఒకటో సచివాలయాన్ని, అబ్రహంపేటలో రూ.పదిహేను లక్షల నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించామన్నారు. అబ్రహంపేటలోని సంఘస్తులు కమ్యూనిటీ భవనం కావాలని కోరడంతో దానికి నిధులు మంజూరు చేయించి మూడు నెలల్లో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. మొగల్తూరులో నాలుగు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు వైసిపి ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలోనే గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాల్లో నరసాపురం నియోజకవర్గం నిలిచి ఆదర్శవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పడవల మేరి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యుల తిరుమల బాపూజీ, వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు, దుసలపూడి దొరబాబు, కుక్కల కృష్ణమోహన్ ఉన్నారు.










