Sep 16,2023 23:20

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

* పేలవంగా జెడ్‌పి సర్వసభ్య సమావేశం
* మంత్రులు, ముఖ్య నాయకుల డుమ్మా
* జిల్లాలోనే ఉన్నా సమయం వెచ్చించని ప్రజాప్రతినిధులు
* సభ్యులు లేవనెత్తిన సమస్యలకు భరోసా కరువు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కరువుపై ఒక సమగ్రమైన చర్చ ఉంటుందని అంతా భావించారు. వీటితో పాటు నీటిపారుదల, విద్య, వైద్య శాఖలు, నాడు-నేడు పనులు, విద్యుత్‌, రోడ్లు వంటి సమస్యలపై సమీక్ష ఉంటుందని, అందులో తమ ప్రాంత సమస్యలను చెప్పుకోవచ్చని జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు ఎన్నో ఆశలు పెట్టకుని వచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లేలా మంత్రులు, అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. జిల్లాలో ఉండి సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చే వారే కరువయ్యారు. జిల్లా పరిషత్‌ పాలకవర్గం రెండున్నరేళ్ల పాలనలో అత్యంత పేలవంగా సాగిన సమావేశంగా విమర్శలపాలైంది.
జెడ్‌పి సర్వసభ్య సమావేశం శనివారం జెడ్‌పి నూతన సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమైంది. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సెలవు పెట్టడంతో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ మాత్రమే వేదికపై కూర్చొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ రాలేదు. దీంతో జెడ్‌పి చైర్‌పర్సన్‌ సమావేశం మొదలుపెట్టారు. తొలుత విద్యాశాఖపై సమీక్షను ప్రారంభించారు. సరుబుజ్జిలి జెడ్‌పిటిసి ఎస్‌.నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ మండలంలోని రాయివలసలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, మతలబుపేటలో పిల్లలు లేని చోట ఐదు అదనపు గదులకు నాడు-నేడు నిధులు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌ జయప్రకాష్‌ ఇచ్చిన సమాధానంతో ఆయన సంతృప్తి చెందలేదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉంటే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరికేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంచిలి జెడ్‌పిటిసి పి.దేవదాస్‌రెడ్డి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల జలంత్రకోటలో ఒరియా ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిగాయని విద్యాశాఖ అధికారులు, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బదులు ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు. విద్యాశాఖ మంత్రి గానీ జిల్లాకు చెందిన మంత్రులు గానీ ఉంటే అక్కడ ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇచ్చే ఉండేవారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాలుగు శాఖలపై చర్చతో సరి
తమ మండలానికి చెందిన ఒక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జలుమూరులో యువచైతన్య యాత్రను తానే దగ్గర ఉండి నిర్వహించారని, మరో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి పాల్పడ్డారని, రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ నందిగాం ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు బదులిస్తూ షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని వారిచ్చిన సమాధానం చూసి చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఇదే అంశంపై మంత్రుల రియాక్షన్‌ వేరే విధంగా ఉండేదని, చర్యలకు సిఫార్సు చేసే వారనే సభ్యుల మధ్య చర్చ నడిచింది. నీటిపారుదలశాఖపై ఐదు నిమిషాల్లోనే ముగించారు. వంశధార, తోటపల్లి, నారాయణపురం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? సమస్యలేమిటనే అంశాలపై కనీస చర్చ జరగలేదు. వ్యవసాయశాఖపై కొంతమేర చర్చ జరిగినా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటల సాగుపై ఎవరూ అడగలేదు. ఒక్క కంచిలి జెడ్‌పిటిసి దేవదాస్‌రెడ్డి మాత్రం మండలంలో పంటలు ఎండిపోయిన అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తమ్మీద నాలుగు ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేసి 2.15 గంటలకే ముగించేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, వి.కళావతి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌, పేరాడ తిలక్‌, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోనే ఉన్నా సమయం వెచ్చించని ప్రజాప్రతినిధులు
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలోనే ఉన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్‌బేగ్‌పేటలో నిర్వహించిన 'గడప గడపకూ మన ప్రభుత్వం'లో పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో పాత్రునివలసలో ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందించారు. గార మండల కేంద్రంలో ఉదయం 10.30 గంటలకు ఐసిడిఎస్‌ ఆధ్వర్యాన నిర్వహించిన పోషణ మహాత్సవాల్లో పాల్గొన్నారు. పశుసంవర్థక మంత్రి సీదిరి అప్పలరాజు ఉదయం పది గంటల వరకు నియోజకవర్గంలో పలుచోట్ల ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ 27వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 15న విజయవాడ వెళ్లి శనివారం నాలుగు గంటలకు విజయనగరం వచ్చారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉదయం పది గంటలకు బూర్జ మండలం చిన్నలంకాం, మామిడివలసలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయి శంకుస్థాపనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. ధర్మాన కృష్ణదాస్‌ ఉదయం తొమ్మిది గంటలకు పోలాకి మండలం చెల్లాయివలస సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. తర్వాత సారవకోట మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. జెడ్‌పి సర్వసభ్య సమావేశం షెడ్యూల్‌ను మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధుల వెసులుబాటు బట్టే నిర్ణయిస్తారు. సమావేశం తేదీ నిర్ణయించిన తర్వాత కూడా సర్వసభ్య సమావేశానికి సమయం వెచ్చించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.