సౌకర్యాలు సమకూరుస్తాం..
ఇళ్ల నిర్మాణాలు చేపట్టండి: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జగనన్న హౌసింగ్‌కాలనీ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని, లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కమిషనర్ మురుకంబట్టు అగ్రహారం లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్లనిర్మాణాలను పరిశీలించారు. ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఏఅవసరం వచ్చినా పాలక సంస్థ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారని వివరించి మేస్త్రీలతో మాట్లాడారు. సెలవురోజుల్లో సైతం పనులు చేయడం ద్వారా వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని సూచించారు. మేస్త్రీలు ముందుకు వస్తే మరిన్ని ఇళ్ల నిర్మాణాలను కేటాయిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారు సత్వరం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులు, అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి సకాలంలో బిల్లులు అందేలా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏఈ శ్రీధర్, అధికారులు ఉన్నారు.










