Oct 24,2023 21:25

పోస్టర్లను దహనం చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌ తదితరులు

* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌
ప్రజాశక్తి - ఆమదాలవలస, కవిటి, శ్రీకాకుళం అర్బన్‌, బూర్జ: 
రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్న సైకో జగన్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కూన రవికుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. సరుబుజ్జిలి మండలంలోని పాలవలసలో బాబుతో నేను, జగనాసుర దహనం కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసిపి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, పన్నుల బాదుడు, నియంతత్వ పోకడలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు జగనాసుర దహనం కార్యక్రమం చేపట్టకూడదని చెప్పడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినా రవికుమార్‌ టిడిపి శ్రేణులతో కలిసి సైకో పోవాలి పత్రాలను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఉంటుందన్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శివ్వాల సూర్యనారాయణ, ఎ.రాంబాబు, లావేటి పూర్ణారావు, టి.వి రమణ, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దేశ చరిత్రలోనే ఇటువంటి నియంత పాలన ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకో పోవాలి, సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు దహనం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పొందల కృష్ణారావు, బెందాళం రమేష్‌, పుల్లట సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో జగనాసుర దహనం కార్యక్రమం చేపట్టారు. సైకో పోవాలి పోస్టర్లను దహనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టిడిపి నాయకులు సింతు సుధాకర్‌, జిల్లా అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ప్రదాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.
బూర్జ మండలంలోని గిరడపేటలో జగనాసుర దహనం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి బిసి సెల్‌ మండల అధ్యక్షులు మామిడి దుర్గారావు మాట్లాడుతూ సైకో పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని విమర్శించారు. రాజకీయ కక్షలతో ప్రశ్నించే వారిని, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో డి.వెంకునాయుడు, బాలకృష్ణ, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.