సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు సైబర్ నేరగాళ్ళపై నిఘా పెంచాలని జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సైబర్ సెక్యూరిటీ పైన ఒక్క రోజు ట్రైనింగ్‌ను జిల్లా ఎస్‌పి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమకాలిన పరిస్థుతులకు అనుగుణంగా కొత్తకొత్తగా పుట్టుకొస్తున్న సైబర్ నేరాలపై అవగాహన, ఇన్వెస్టిగేషన్‌లో నైపుణ్యత సాధించుట కొరకు, సైబర్ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొని త్వరితగతిన నేర చేధన జరిగేలా చేయడం జరుగుతోందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని నిపుణుల చేత తర్ఫీదు చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఒక్క రోజు వర్క్‌షాప్‌ను డిస్ట్రిక్ట్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజల జీవన శైలితో పాటు నేరాల స్వరూపం కూడా మారుచున్నదని, నేటి జీవనచిత్రంలో ఆన్లైన్ మోసాలు సర్వసాధారణం అయ్యాయని ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మోసాలకు గురవుతూనే ఉన్నారు. అటువంటి నేరాల పట్ల పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కలిగించి అందులో నైపుణ్యత సాధించేటట్లు తీర్చిదిద్దేటందుకే ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి జగదీశ్, చిత్తూరు డిఎస్‌పి సుధాకర్ రెడ్డిలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










