ప్రజాశక్తి - భీమవరం రూరల్
మహిళలకు సమాజంలో సముచిత స్థానం రావాలని సంపూర్ణ విద్య నినాదంతో సావిత్రిబాయి పూలే ఉద్యమించారని సిఎస్‌ఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ చీడే సత్యనారాయణ అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సిఎస్‌ఎన్ కళాశాలలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్థంతి, ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ సీనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ, ఎండి సలీమ్ ఖాన్, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడారు. అనంతరం జూనియర్ కళాశాలలో ఉత్తమ అధ్యాపకులుగా విశిష్ట సేవలందిస్తున్న ఐ.ప్రదీప, ఎండి తోహిబా, కె.పవిత్రను సత్కరించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్‌డి సరోజినీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెనుమంట్ర :ప్రతి ఒక్కరూ సావిత్రీబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని బిసి మహాసభ జిల్లా అధ్యక్షులు అల్లాడ సూర్య భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుల వ్యవస్థ నిర్మూలనకు ఆమె కృషి చేశారని తెలిపారు. మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించారని పేర్కొన్నారు.
పాలకొల్లు : ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జ్యోతి సావిత్రిబాయి పూలే వర్థంతిని కళాశాల ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో చరిత్ర అధ్యాపకులు కె.పార్థసారథి, బి.రామలక్ష్మి, అర్థశాస్త్ర, అధ్యాపకురాలు వి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
మొగల్తూరు : స్త్రీ విద్యా అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పెంకెవారి కాంప్లెక్స్‌లో సావిత్రిబాయి పూలే వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో కండిబోయిన సుబ్రహ్మణ్యం, పెంకి చంపేశ్వరరావు, రాయుడు కృష్ణారావు, మోటుపల్లి ముత్యాలరావు పాల్గొన్నారు.










