May 18,2023 21:16

పాలకోడేరు :ముఖ్యమంత్రి జగన్‌ నెలకొల్పిన సచివాలయ, వాలంటరీ వ్యవస్థలో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు సాటివారిని ఆదుకోవాలనే ఆలోచన రావడం అభినందనీయమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. విస్సాకోడేరు గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన పాలూరు అన్వేష్‌ కుటుంబానికి గురువారం ఆర్థికసాయం అందజేశారు. సర్పంచి బొల్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా సిఐలు కలిపి సేకరించిన రూ.48 వేలను పివిఎల్‌ నరసింహరాజు చేతుల మీదుగా ప్రస్తుతం వాలంటరీగా పనిచేస్తున్న రమేష్‌ భార్య ధనలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా పివిఎల్‌ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది వాలంటీర్లు, డ్వాక్రా సిఎల దాదృత్వంతో రమేష్‌ కుటుంబానికి అండగా ఉండడం అభినందనీయమన్నారు. సర్పంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యుదాఘాతనికి గురై రమేష్‌ దురదృష్టవశాత్త్తూ మరణించడం బాధాకరమన్నారు. రమేష్‌ భార్య ధనలక్ష్మికి పసి వయసు కలిగిన ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పేర్కొన్నారు. రమేష్‌ కుటుంబానికి గ్రామస్తులంతా అండగా ఉంటామని చెప్పారు.విస్సాకోడేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి.లతా నాగశ్రీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 567 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను గురువారం ఆమెను ఘనంగా సత్కరించారు. స్థానిక సచివాలయం వద్ద సర్పంచి బొల్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు డిసిసిబి ఛైర్మన్‌ నరసింహరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సర్పంచి శ్రీనివాస్‌ లతా నాగశ్రీని రెండేళ్లపాటు తిరుమల కళాశాలలో చదివిస్తానని సభలో ప్రకటించారు. పివిఎల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు సర్పంచిని అభినందించారు. అలాగే పంచాయతీ మూడో వార్డు సభ్యులు కలిదిండి సత్యనారాయణ రాజు విద్యార్థిని లతా నాగశ్రీకి విద్యాభ్యాసానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన అఖిల, యోగ లక్ష్మీ ప్రసన్నకు రూ.2 వేల చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచి కందుల నాగరాజు, మాజీ సర్పంచి పెనుమత్స శ్రీనివాసరాజు, అశోక్‌ బాబు, ఎంపిటిసి సభ్యులు బొల్లం గాంధీ పాల్గొన్నారు.