Feb 22,2022 22:40

భూముల రీసర్వేపై అధికార్లతో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్‌ రీ సర్వే శాశ్వతంగా రైతుల భూములకు రికార్డు భద్రత కోసమేనని, పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న సర్వే కచ్చితమైనదిగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ యం. హరినారాయణన్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం రీ సర్వేపై జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) రాజబాబుతో కలిసి జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పైలెట్‌ ప్రాజెక్టుగా జరిగే రీసర్వే ఖచ్చితమైనదిగా ఉండాలని, అప్పుడే వంద సంవత్సరాలపాటు రైతుల భూములకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉండి భూసమస్యలు తలెత్తవన్నారు. మొదటి విడతలో ప్రారంభమైన రీ సర్వే 1629.32 ఎకరాల్లో జరిపారని ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందని, ఈ సర్వే లోని అనుభవాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జాయింట్‌ కలెక్టర్‌ రెవెన్యూ రాజబాబు రూపొందించిన నిర్ధిష్టమైన ప్రణాళిక, సమయం వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చి రెండవ పైలెట్‌ ప్రాజెక్టుకు సర్వేయర్లు పని చేయాలని తెలిపారు. మొదటి రీ సర్వేలో చంద్రగిరి మండలం నరసింగా పురం, గుడిపాల మండలం ముత్తుకూరు పల్లి, జీడీ నెల్లూరు మండలం అగర మంగళం, వాల్మీకిపురం జమ్మాలపల్లి గ్రామాలలో చేపట్టామని తెలిపారు. రెండవ విడతలో నిమ్మనపల్లి మండలం, చౌకిళ్ళ వారిపల్లి, కురబలకోట మండలం, ముతకనవారిపల్లి, చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగ, మదనపల్లి మండలం కాశిరావు పేట, పూతలపట్టు మండలం సిద్ద లింగనపల్లి, పెనుమూరు మండలం సి ఎస్‌ అగ్రహారం, తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణ పల్లి, బంగారుపాలెం మండలం నూనెగుండ్లపల్లి, తంబళ్లపల్లి మండలం ఎర్రసానిపల్లి, గుడిపాల మండలం పాపసముద్రం, తంబళ్లపల్లి మండలం పాంచాలమర్రి, కన్నె మడుగు, సదుం మండలం నడిగడ్డ, బూరగమంద చెరుకువారి పల్లి, తిమ్మనాయుని పాలెంలో జరుగుతున్న రీ సర్వే విధానాలపై సమీక్ష నిర్వహించారు. డ్రోన్‌ సర్వేలు ఇప్పటికి 35 గ్రామాలు 660 హ్యాబిటేషన్‌ లలో జరిపినట్లు, మరో 294 గ్రామాలను డ్రోన్‌ సర్వే కొరకు గుర్తించామని, డ్రోన్స్‌ రాగానే ప్రారంభించను న్నామని ఏడి సర్వే జయరాజ్‌ వివరించారు. రైతుల సంతృప్తి, అభీష్టం మేరకు సర్వే నిర్వహణ ఉండాలని, రైతుల సమస్యలు, అనుమానాలు నివత్తి చేసి ముందుకెళ్లాలని తెలిపారు. ఈ సమీక్షలో జెసి (ఆసరా) రాజశేఖర్‌, కె ఆర్‌ ఆర్‌ సి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రవీణ్‌, సర్వే ఇన్స్‌ పెక్టర్లు శాంత రాజ్‌, ముని కన్నన్‌, గిరి తదితరులు పాల్గొన్నారు.