Oct 08,2023 23:37

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

* జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : 
మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావనలు పెరుగుతున్న నేపథ్యంలో జన విజ్ఞాన వేదికగా శాస్త్రీయ దృక్పథాన్ని విస్తృతంగా, నిరంతరాయంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ఫిబ్రవరి 28 వరకు క్యాంపెయిన్‌ కొనసాగించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ పిలుపు నిచ్చారు. నగరంలోని యుటిఎఫ్‌ భవనంలో జెవివి జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముందుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్టు, సంబరాలు వచ్చే నెల 18న పాఠశాల స్థాయిలో, 30న మండలస్థాయిలో, డిసెంబరు 17న జిల్లా స్థాయిలో, జనవరి 27న రాష్ట్రస్థాయిలో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. చెకుముకి సంబరాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. విద్యార్థి చెకుముకి పత్రిక ఎక్కువ మంది విద్యార్థులకు చేర్చేందుకు సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో సైన్స్‌ ఉద్యమం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్వర్క్‌ ఆధ్వర్యాన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సదస్సులు, సెమినార్లు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. శాస్త్రీయ విజ్ఞానం ప్రచారం కోసం విరివిగా పోస్టర్లు ముద్రించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
సమావేశంలో సాంస్కృతి విభాగం నాయకులు శ్రీనివాసులు, రామస్వామి, సంజీవరావు, వేదవతి గేయాలను ఆలపించారు. సమావేశంలో జిల్లా పాటర్న్‌ కొత్తకోట అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌.సంజీవరావు, జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ బోగెల ఉమామహేశ్వరరావు, సమత విభాగం నాయకులు తంగి ఎర్రమ్మ, పి.వేదవతి, సాంస్కృతిక విభాగం నాయకులు ఎస్‌.శ్రీనివాసులు, పైడి రామస్వామి, పర్యావరణ కమిటీ నాయకులు అగత మూడి వాసుదేవరావు, సైన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ నాయకులు హెచ్‌.మన్మథరావు, విద్యావిభాగం నాయకులు ఎస్‌.నరసింహమూర్తి, కె.ఎల్‌.నారాయణ, ఎం.తవిటిబాబు, వైద్య విభాగం నాయకులు ఆర్‌.చిన్నారావు, యువజన విభాగం నాయకులు బర్రి పురుషోత్తం పాల్గొన్నారు.