Mar 29,2023 23:00

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు

ప్రజాశక్తి-రాయదుర్గం       రాయదుర్గం పురపాలక సంఘంలో కాంటాక్టు, అవుట్సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులను తన సొంత పనులకు వినియోగించుకుంటూ, వారి జీవితాలతో చెలగాటమాడుతున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం డిమాండ్‌ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రను సస్పెండ్‌ చేయాలని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు నాగభూషణం మాట్లాడుతూ.. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌కు చెరకు రసం అంగళ్లు ఉన్నాయన్నారు. సోమవారం చెరకు గడలను చెక్కేందుకు కార్మికులను పంపారని తెలిపారు. అందులో కార్మికుడు హెచ్‌ తిప్పేస్వామి చేతికి కొడవలి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన పారిశుధ్య కార్మికులను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తన సొంత పనులకు వినియోగించుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో కూడా తన ఇంట్లో పని చేయడానికి కార్మికులను వినియోగించుకున్నారని తెలిపారు. హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో రాయదుర్గం మున్సిపాల్టీ కార్మికులను వినియోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌పై మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటని, కార్మికులను తన వ్యాపార సముదాయాలలో పని చేయించుకోవడానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. అనంతరం పాత మున్సిపల్‌ కార్యాలయం నుండి కొత్త మున్సిపల్‌ కార్యాలయం వరకు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కమిషనర్‌ను కలిసి విషయాన్ని వివరించారు. శానిటరీ ఇన్‌స్పెక్టరును తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసే వరకు కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం కొనసాగిస్తారని హెచ్చరించారు. స్పందించిన కమిషనర్‌ దివాకర్‌రెడ్డి జరిగిన సంఘటనపై విచారణ చేపడతామన్నారు. రవీంద్ర యాదవ్‌ సస్పెన్షన్‌పై ఉన్నతాధికారులకు నివేదికను పంపుతామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు వరలక్ష్మి, నరసమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కుల్లాయప్ప, నరసింహులు, సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు రాము, తిప్పేస్వామి, బసవరాజు, మల్లేష్‌, ఆదిలక్ష్మి, సిద్ధిలింగ, రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికుల యూనియన్‌ నాయకులు విజరు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.