Apr 28,2023 21:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

        అనంతపురం : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు సిబ్బంది అందరూ వారి హోదాలను మరించి సమిష్టిగా పని చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లాలోని ఎస్‌ఐలు, ఆపైస్థాయి పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేవ్‌ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలన్నారు. నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాలు సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్‌ తదితరం అన్నీ పక్కాగా చేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టుల ప్రయోగం, జిల్లా బహిష్కరణలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో చిన్న సమస్యలు సైతం తలెత్తకుండా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. స్థలాలు, పొలాల విషయంలో పోలీసుల హద్దు మేరకు మాత్రమే పని చేయాలన్నారు. మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌లను పూర్తి స్థాయిలో నియంత్రించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులు స్వేచ్ఛగా వారి బాధలు చెప్పుకునే పరిస్థితులను కల్పించాలన్నారు. స్పందన అర్జీలపైనా దృష్టి సారించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇదివరకే సాంకేతికతతో నడుస్తున్న కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు, డీఎస్పీలు చైతన్య, నరసింగప్ప, బి.శ్రీనివాసులు, ఆంథోనప్ప, ఆర్ల శ్రీనివాసులు, ఎస్‌.ుహబూబ్‌ బాషా, శ్రీనివాసులుతో పాటు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.