ప్రజాశక్తి-గుత్తి సాంకేతిక రంగంలో భారతదేశం దూసుకెళ్తోందని గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ రంగాచార్యులు తెలిపారు. శుక్రవారం గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐడియా క్లబ్ ఆధ్వర్యంలో 'హ్యాక్ ఏ బైట్' అనే పేరుతో జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాకథాన్ లాంటి కార్యక్రమాలు దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ హ్యకథాన్ అనేది ఒక సామాజిక కోడింగ్ వేదిక అని కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఇతరత్రా ఔత్సాహికులను ఒకచోట చేర్చి కొత్త సాఫ్ట్‌వేర్ మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఈ జాతీయ స్థాయి హ్యకథాన్‌లో ఐఒటి, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసే అంశంపై నిర్వహించామన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ శ్రీవాణి, ఎండి గజ్జల రఘునాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సురయ, కార్యక్రమ నిర్వాహకులు కన్నప్పన్, అనంతగుప్త, దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న రైల్వే సీనియర్ డిఎంఇ రంగాచార్యులు










