Mar 07,2023 21:24

ప్రజాశక్తి - మొగల్తూరు
సిపిఎం నేత ఆదూరి సాంబమూర్తి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై యుక్త వయసులోనే సిపిఎంలో చేరి ఉద్యమ బాటలో సుదీర్ఘకాలం నడిచారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మంగళవారం మొగల్తూరు పంచాయతీ పరిధి పడమటిపాలెంలో ఆదూరి సాంబమూర్తి అనసూయ దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. సాంబమూర్తి నిస్వార్ధంగా ప్రజా, రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలు నిర్వహించారన్నారు. మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ సాంబమూర్తి సేవలు నేటి తరానికి ఆదర్శమన్నారు. జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల విజయవంతానికి సాంబమూర్తి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ సాంబమూర్తి చేపట్టిన ప్రజా ఉద్యమాలకు ఆయన సతీమణి అనసూయ కూడా సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. పదవులు ఆశించకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. మొగల్తూరులోని కిల్లి సోడా వర్తక సంఘం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట హరిచంద్ర ప్రసాద్‌ అన్నారు. సొసైటీలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో రైతు సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని సొసైటీ ఛైౖర్‌ పర్సన్‌ మోటిపల్లి రామ భాస్కరరావు అన్నారు. ఆదూరి సాంబమూర్తి మాట్లాడుతూ తాను కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చేందుకు పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శమన్నారు. పార్టీ మొగల్తూరు శాఖకు రూ.ఐదు లక్షలు, జిల్లా శాఖకు రూ.2 లక్షలు, నర్సాపురం పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు లక్ష రూపాయలు, ఐద్వాకు రూ.50,000 ఇచ్చానని తెలిపారు. తన ఆస్తి అంతా సిపిఎం పార్టీ అని అన్నారు. తుది శ్వాస విడిచే వరకూ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. తన మరణానంతరం తన దేహాన్ని మెడికల్‌ కళాశాలకు ఇచ్చేందుకు ప్రక్రియ అంతా పూర్తి చేశానని తెలిపారు. అనంతరం సాంబమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. తరువాత సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతకాయల బాబూరావు, జెఎన్‌వి గోపాలన్‌, కేతా గోపాలన్‌, ఎ.రవి, తెలగంశెట్టి సత్యనారాయణ, వలవల శ్రీరామ్మూర్తి, పొదిలి కృష్ణమూర్తి, జుత్తిగ నరసింహమూర్తి, పివి.ప్రతాప్‌, పొన్నాడ రాము, యడ్ల చిట్టిబాబు, సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, బోణం నరసింహారావు, జి.శ్రీను పాల్గొన్నారు.