
* రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అత్యధిక జనాభా గల భారతదేశం లౌకిక రాజ్యమని, ఇక్కడ సామాజిక న్యాయం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని పాటించడమంటే తిరిగి ఆదిమ కాలానికి వెళ్లడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. కెవిపిఎస్ ఆధ్వర్యాన 'సనాతన ధర్మమా? సామాజిక న్యాయమా? అనే అంశంపై నగరంలోని ఎన్‌జిఒ హోంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజం అభివృద్ధి కావాలంటే సామాజిక న్యాయాన్ని అన్ని దశల్లో, అన్ని వర్గాల్లో అమలు చేయాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దేశంలో కుల వివక్ష, అంటరానితనం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు పెరగడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెరికేయాలన్నారు. మతోన్మాద దుశ్చర్యలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మూఢాచారాల వల్ల సమాజం తిరోగమనానికి వెళ్తుందన్నారు. సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.రాంగోపాల్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పి.చంద్రపతిరావు, రెల్లి హక్కుల పోరాట సమితి నాయకులు సుధాకర్, కెఎన్‌పిఎస్ జిల్లా కార్యదర్శి ఎస్.జగన్నాథరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జి.గిరిధర్, జి.సింహాచలం, పి.లక్ష్మీపతి, కె.చంద్రశేఖర్, ఎం.గోవర్థన్, ఆర్.శంకరరావు, టి.తిరుపతిరావు, ఎం.ఆదినారాయణ మూర్తి, డి.పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.