Oct 10,2023 22:03

రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు మార్గదర్శక పత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
సామాజిక మార్పు యువతతోనే సాధ్యమని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. మెరుగైన సమాజం, సామాజిక మార్పు కోసం యూత్‌, జూనియర్‌ రెడ్‌క్రాస్‌ క్లబ్‌లు దోహదపడతాయని తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ కమిటీ జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా విద్యార్థులు, యువతకు మానవత్వం బోధపడుతుందని చెప్పారు. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ (జెఆర్‌సిి), యూత్‌ రెడ్‌క్రాస్‌ (వైఆర్‌సిి)లో అధిక సంఖ్యలో విద్యాసంస్థలు, విద్యార్థులు చేరేలా కృషి చేయాలన్నారు. మిలియన్‌ సంఖ్యలో విద్యార్థులను జెఆర్‌సిలో చేర్చేందుకు గవర్నర్‌ లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆ దిశగా పనిచేసి సామాజిక మార్పునకు నాంది పలకాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ఐక్యత, నిష్పాక్షికత, స్వాతంత్య్రం, సార్వత్రికత సూత్రాల ఆధారంగా రెడ్‌క్రాస్‌ పనిచేస్తోందన్నారు. యువతలో ఈ భావజాలాన్ని పెంపొందించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. సామాజిక స్పృహ ఉన్న విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. నెలకోసారి ఈ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, సబ్‌ కమిటీ కన్వీనర్‌ పి.శ్రీకాంత్‌, ఆర్‌ఐఒ దుర్గారావు, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.సురేఖ, బరాటం చక్రవర్తి, శంకరనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు మార్గదర్శక పత్రాలు ఆవిష్కరణ
రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు మార్గదర్శక పత్రాలను కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు శ్రీకేష్‌ లాఠకర్‌ కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబరులో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సభ్యత్వం నమోదు చురుగ్గా సాగాలన్నారు. గ్రామాలు, పట్టణాల పరిధిలో సంబంధిత అధికారుల ద్వారా సభ్యత్వాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. సభ్యత్వం పొందిన వారందరూ తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు. అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసిన సభ్యులకు కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందించనున్నట్లు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న జెసి నవీన్‌