Oct 28,2023 23:54

సామాజిక అస్త్రం ఫలించేనా?

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీల మద్దతు కూడగట్టేందుకు యాత్రలకు వైసిపి స్వీకారం చుట్టింది. ప్రధానంగా ఆయా తరగుతల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. యాత్రల ద్వారా వారి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సామాజిక అస్త్రం ఎంత వరకు ఫలిస్తుందో, రాజకీయంగా వైసిపికి ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం సభలు నిర్వహిస్తున్న చోట్ల పేలవంగానే సాగుతున్నాయి. ఇచ్ఛాపురంలో నిర్వహించిన తొలి సభకు జనాలను సమీకరించడానికి స్థానిక నాయకత్తం నానా పాట్లు పడింది. ఎస్‌హెచ్‌జి మహిళలను, వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారిని బలవంతంగా తీసుకొచ్చారన్న విమర్శలు వినిపించాయి. సభకు వచ్చిన జనం చివరి వరకు ఉన్నారంటే అదీ లేదు. సభలో నలుగురు నేతలు మాత్రమే మాట్లాడగా... చివరిగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడే సమయానికి సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పథకం ద్వారా లబ్ధి కలిగిస్తుందంటే వచ్చిన జనం చివరి వరకు ఓపికగా ఉంటారు. అవేవీ లేకుండా కేవలం ప్రసంగాలు చెప్తామంటే వినడానికి పెద్దగా ఆసక్తి చూపే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హాజరవుతున్న సభలకే జనం చివరి వరకు ఉండని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మంత్రులు, ప్రజా ప్రతినిధుల సభల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రసంగాల్లోనూ కొత్త దనమేదీ కనిపించలేదు. ఆత్మస్తుతి, పరనిందగానే సాగాయి. టిడిపి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, జిల్లా నుంచి వలసలు మాత్రం పెరిగాయంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా జిల్లా వాసులే కనబడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందంటూ చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నాలుగున్నరేళ్లలో జిల్లాకు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారని, వలసలు ఆగాయో అమాత్యులు వారే చెప్పాలి. ఎడాపెడా పెంచుతున్న విద్యుత్‌ ఛార్జీలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవతుంటే... దానినీ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగానే విద్యుత్‌ వినియోగం పెరిగిందని, దాని ఫలితంగానే ఛార్జీలు పెరిగాయంటూ చెప్పుకొచ్చారు. 2014-19 కాలంలో వాడిన విద్యుత్‌కు, ఆ తర్వాత సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనిని విద్యుత్‌ వినియోగం పెరిగిందనే పేరుతో ధరలు పెరిగాయని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఉద్దానం ప్రాంతానికి గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, తమ ప్రభుత్వం రక్షిత తాగునీటి పథకం, కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని కేటాయించామంటూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ కిడ్నీ బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతూనే ఉన్నారు. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రకమైన ఉపశమన చర్యలేవీ ఈ ప్రభుత్వమూ చేయలేదన్న బాధ బాధితుల్లో ఉంది.
బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ తరగతులకు ఆర్థిక పరిపుష్టి చేశామని, వారి జీవన ప్రమాణాలు పెంచిందంటూ బొత్స చెప్పుకొచ్చారు. అసలు వాస్తవాలను విస్మరించారు. ఆయా తరగతుల సంక్షేమానికి ఉద్దేశించిన కార్పొరేషన్ల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూస్తున్నాం. ఉదాహరణకు ఎస్‌సి కార్పొరేషన్‌ పరిస్థితే తీసుకుందాం. ఈ సామాజిక తరగతి కోసం చాలా కాలం నుంచి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ పనిచేస్తూ వస్తోంది. 2019 వరకు కార్పొరేషన్‌ కార్యకలాపాలు బాగానే ఉన్నా... ఆ తర్వాత కాలం నుంచి నిస్తేజంగా మారింది. గతంలో కార్పొరేషన్‌ ద్వారా భూ అభివృద్ధి పథకం కింద భూములు కొనుగోలు చేసి ఎస్‌సిలకు ఇచ్చేవారు. నాలుగేళ్లుగా ఒక్కరికీ ఒక్క సెంటు భూమీ ఇవ్వలేదు. ఎస్‌సి యువతకు వివిధ రకాల యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇచ్చేవారు. వాటినీ ఆపేశారు.
ఎస్‌సి సబ్‌ప్లాన్‌ కింద 16 శాతం నిధులను వీటి కోసం ఖర్చు చేసేవారు. సామాజిక పింఛన్లు పొందుతున్న ఎస్‌సి లబ్ధిదారులకు ఇచ్చిన సొమ్మునే 16 శాతం కింద చేసిన ఖర్చులో చూపడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న ఎస్‌సి మహిళలు, యువతకు ఇచ్చిన డబ్బులనూ సబ్‌ప్లాన్‌ కింద వెచ్చిస్తున్నట్లు చూపుతున్నారు. ఎస్‌టి సబ్‌ప్లాన్‌, బిసి, మైనార్టీ సంక్షేమశాఖ పరిస్థితీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయా తరగతులు డైరక్ట్‌ బెనిఫిట్‌ స్కీం (డిబిటి) ద్వారా పొందుతున్న సొమ్ములనే వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న గణాంకాల్లో చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకున్న ఓ నిర్ణయం ఎస్‌సిలకు నష్టం తెచ్చి పెట్టేలా ఉంది. ఆసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే పేరుతో 2003, జూలై 31కు ముందు కేటాయించిన భూములపై ఆంక్షలు తొలగిస్తూ ఈ ఏడాది జూలై 27న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌సిలకు కేటాయించిన భూములను క్రయవిక్రయాలు చేసుకునే వీలు పడుతుంది. జిల్లాలో 2003కు ముందు 38,868.72 ఎకరాలను కేటాయిస్తే అందులో పేదల సాగులో 14,852.61 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. మిగిలిన 24,016 ఎకరాలు పెద్దల ఆధీనంలో ఉన్నట్లు ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో తేలింది. పేదల అవసరమే ఆసరాగా చేసుకుని గ్రామాల్లోని భూస్వాములు, నాయకులు పేదల నుంచి తక్కువ ధరకు అనధికారికంగా కొనుగోలు చేసి తమ పరం చేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్లు, రొయ్యలు, చేపల చెరువుల కింద వినియోగిస్తున్నారు. భూస్వాములు, నాయకులు కొనుగోలు చేసిన భూములకు నష్టం రాకుండా చేసేందుకే ఆ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఒక వైపు వారికి మేలు చేస్తున్నామటూ ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు వారికి నష్టం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ రకమైన సాధికారతను ఆయా తరగతులు అంగీకరిస్తాయా? వైసిపి అనుకున్న రాజకీయ ప్రయోజనం నెరవేరు తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.