Aug 01,2023 22:33

ఈ కొండలోనే సాకే భారతికి కేటాయించిన భూమి ఉంది

          అనంతపురం ప్రతినిధి : కొండంత కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను పూర్తి చేసిన సాకే భారతికి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పేదరికంలో మగ్గుతున్న భారతి కుటుంబానికి తోడ్పాటు, సహకారం అందించేందుకు పెద్దఎత్తున మనసున్న వ్యక్తులు ముందుకొస్తున్నారు. ఆమె ఇంటికి నిత్యం అనేక మంది వచ్చి ఇన్ని కష్టాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న ఆమె జీవితం ఒక ఆదర్శం అని చెబుతున్నారు. ఇంతటి ఆదరణ, అభిమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించింది. ఆమెకు రెండు ఎకరాల వ్యవసాయ పట్టాను అందించారు. అయితే ప్రభుత్వం ద్వారా అందిని సాగుభూమి కొండలో ఉండడం... అది సాగుకు అనువుగా లేని పరిస్థితులు ఉండడంతో అందరూ ఇదేమి ఔదార్యం అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.
సాకే భారతి ఎస్‌కె యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి అందుకున్న తరువాత పెద్ద ఎత్తున ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. కష్టాలను జయించి పిహెచ్‌డి తీసుకున్న ఆమెను అభినందిస్తూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆమెను గుర్తించింది. సోమవారం నాడు కలెక్టర్‌ గౌతమి ఆమెను పిలిపించి అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందని చెబుతూ రెండు ఎకరాల భూమిని ఆ కుటుంబానికి ఇస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా పట్టానూ అందజేశారు. జూనియర్‌ అధ్యాపకురాలి ఉద్యోగం కాంట్రాక్టు పద్ధతిలో ఇస్తామని సాకే భారతికి కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇది చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు.
రెండు ఎకరాల వాస్తవ పరిస్థితి ఇది...
కలెక్టర్‌ గౌతమి చేతులు మీదుగా అందుకున్న రెండు ఎకరాలు ఎక్కడా అని ఆరాతీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతి కుటుంబం ఉంటున్నది శింగనమల మండలంలోని నాగులగుడ్డం గ్రామం. ఇది గార్లదిన్నె మండల కేంద్రానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆమెకు ఇచ్చిన రెండు ఎకరాల పట్టా చూస్తే ఈ గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగులగుడ్డం నుంచి శింగనమల అవతలు ఐదారు గ్రామాలు దాటి ఉంది. అది కూడా సరైనదా అంటే పైన కనిపిస్తున్న కొండ. అందులోనూ ఈ రెండు ఎకరాలు ఎక్కడుందో ఈ స్థలాన్ని గుర్తించిన అధికారులకే తెలియాలి. అక్కడికి పట్టాను తీసుకున్న తరువాత అంతదూరంలో భూమిని తాము ఏమి చేసుకోగలమని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇందకు అధికారులు 'మౌనంగా ఉండండి మీకు మీ ప్రాంతంలో మార్చి తరువాత పట్టా అందజేస్తాం'.. అంటూ అధికారులు వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కావాలి
సాకే భారతి

తాను అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ కావాలన్నది తన లక్ష్యమని భారతి చెబుతున్నారు. అధికారులు మాత్రం తమ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడనికి జూనియర్‌ లెక్చరర్‌ పోస్టు ఒకటి గుత్తి సమీపంలో ఉందని చెబుతున్నారు. అక్కడ చేరుతామంటే ఇస్తామని చెబుతున్నారు. మరి ఉద్యోగంలో చేరుతారా అని అడిగిన దానికి భారతి స్పందిస్తూ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ కావాలన్నది తన ఆశయమని దాని కోసం ప్రయత్నిస్తానని చెబుతోంది. ఎస్‌కెయులో బ్యాక్‌లాక్‌లో పోస్టు ఖాళీగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభుత్వాన్ని తాను కోరుతున్నది ఇదొక్కటే ఇంకేమి వద్దు... తనకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది.