ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కాయాకష్టం చేసి నిర్మించుకున్న ఇళ్ల పట్టాలివ్వాలని 16 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న శ్రీశ్రీ కాలనీ పేదల కల ఎట్టకేలకూ సాకారమైంది. సిపిఎం నిర్విరామ పోరాటాల ఫలితంగా నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో గురువారం శ్రీశ్రీ నగర్‌లోని 272 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ వైసిపి పేదల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. సిఎం జగన్ పేదలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా నియోకవర్గంలో ఎప్పటి నుంచో శ్రీశ్రీ కాలనీ ప్రజలు పట్టాల కోసం ఎదురు చేశారన్నారు. గతంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం సందర్భంగా శ్రీశ్రీ నగర్‌కు వచ్చినప్పుడు కూడా ప్రజలు తమ కష్టాలు తెలిపారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు మంజూరు చేసి హామీని నిలబెట్టుకున్నామన్నారు. అంతేగాకుండా ఈ కాలనీలో రూ.50 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీశ్రీ నగర్‌లో బ్రిడ్జిని నిర్మించామన్నారు. భవిష్యత్తులో బ్రిడ్జి వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపోతే ఇళ్ల పట్టాల కోసం సిపిఎం, వామపక్ష పార్టీలు పోరాటం మరువలేనిదన్నారు. వారి పోరాటాల్లో తాను కూడా ప్రత్యక్షంగా పరోక్ష్యంగా భాగస్వామి అయ్యాయని గుర్తు చేశారు. ఇళ్లపట్టాలు పొందిన వారు ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే రూ.1.80 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ మూడు ప్రభుత్వాలు మారినా పేదలకు పట్టాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆందోళన పడుతున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఆనందం నింపారన్నారు. ప్రజల తరుపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమ పక్షాన పోరాటాలు చేసిన సిపిఎం నాయకత్వానికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతిసాహిత్య, కార్పొరేటర్ మునిశేఖర్, రాజీవ్ కాలనీ మాజీ సర్పంచి హుసేన్, వైసిపి నాయకులు మధన్‌మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ మసూద్, ఎంపిటిసి రమీజాబి, సిపిఎం నాయకులు ప్రకాష్, వలి, బాబు, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అనంత, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్










