Jul 29,2023 22:26

రామగిరి మండలం దుబ్బార్లపల్లి వద్ద ఆగిన జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు జలాశయంకు నీరందించే కాలువను చూపుతునన్న మాజీ మంత్రి పరిటాల సునీత

           అనంతపురం ప్రతినిధి : సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రాయలసీమ ప్రాజెక్టులపై యాత్ర చేపట్టనున్నారు. ఆగస్టు రెండో తేదిన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టిడిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి తప్ప పనులు జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు కాలువ వద్దకెళ్లి సెల్పీ ఛాలెంజ్‌ విసిరారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు
ఇద్దరి హయాంలో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పేరూరుకు ఎత్తిపోతల ద్వారా హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటిని అందించే పనులను అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు రూ.804 కోట్లతో 2018లో శంకుస్థాపనను చేశారు. దీనికి భూసేకరణ ఏదీ జరగకుండానే పనులను ప్రారంభించారు. 2019 ఎన్నికల నాటికి కూడా ఈ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. 2019 ఎన్నికల్లో వైసిపి విజయం సాధించాక చెన్నెకొత్తపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకసారి శంకుస్థాపన చేశారు. 2024 ఎన్నికల్లోపు మూడు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆనాడు ప్రకటించారు. కాని ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. దీనికి సంబందించి కూడా భూసేకరణ ఇప్పటికీ పూర్తవ లేదు. పనులు ముందుకు సాగలేదు. రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు పరిస్థితి ఇదే రకంగా ఉంది. భూసేకరణకు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో నిధులు విడుదల చేయడంతో నిర్వాసితుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. కాని ఇక్కడ కూడా ప్రాజెక్టు పనులు మాత్రం ప్రారంభమవలేదు.
ఇద్దరి హయాంలోనూ అదే పరిస్థితి..
టిడిపి, వైసిపి ఇద్దరి హయాంలో ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఆగి ఉన్నాయి. హంద్రీనీవా వెడల్పు పనులు అదే పరస్థితి నెలకొంది. టిడిపి హయంలో కాలువ వెడల్పు 3800 ప్రవాహ సామర్థ్యం పెంచుతామని పనులు ప్రారంభించారు. అయితే వారి హయాంలో పూర్తవలేదు. వైసిపి అధికారంలోకి వచ్చాక దీని సామర్థ్యాన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతామని ప్రకటించి టెండర్లు సైతం పిలిచారు. కాని పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. పనులు పూర్తికాకపోవడం వలన గడిచిన మూడేళ్లుగా నీళ్లు పుష్కలంగా ఉన్నా నీటిని పూర్తి స్థాయిలో జిల్లాకు తీసుకురాలేకపోయారు. 25 టిఎంసిల్లోపే నీటిని తీసుకోగలిగారు.