ఇరిగేషన్ ఎఇకి రైతుల మొర
ప్రజాశక్తి - వీరవాసరం
కొణితివాడ ఆయకట్టులో నెలకొన్న సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇరిగేషన్ ఎఇ బి.సత్యనారాయణకు గురువారం మొరపెట్టుకున్నారు. వంతులవారీ విధానంలోను తమకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు వాపోయారు. వీరవాసరం తూర్పు కాలువ పరిధిలో ఉన్న పెనుమంట్ర ఆయకట్టు, వీరవాసరం మండలంలో మరికొంత ఆయకట్టుకు ఉన్న తేడాల వల్ల తమకు సాగునీరు అందడం లేదని కొణితివాడ రైతులు తెలిపారు. కొణితివాడ ఆయకట్టు కంటే పెనుమంట్ర ఆయకట్టు పల్లంగా ఉంటుందని రైతులు తెలిపారు. ఈ క్రమంలో కొణితివాడ ఆయకట్టుకు వంతు కేటాయింపు సమయంలో పూర్తిస్థాయి లెవెల్‌లో సాగునీరు విడుదల చేస్తే కాలువ ఎగువ భాగంలో పల్లంగా ఉన్న పెనుమంట్ర ఆయకట్టు ముంపునకు గురవుతుందని రైతులు తెలిపారు. దీంతో ఆ రైతుల ఒత్తిడి మేరకు అధికారులు కాలువ లెవెల్ తగ్గిస్తున్నారని, దీంతో తమ ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని తెలిపారు. విజ్జేశ్వరం నుండి తగినంత సాగునీరు విడుదల చేయడం లేదని, అందువల్లే క్షేత్ర స్థాయిలో సాగునీటి కొరత ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. దాళ్వా వరిపైరు పొట్ట దశలో ఉందని, ఈ స్థితిలో సాగునీరు సక్రమంగా అందకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు నాగరాజు గోపిరాజు, పెదబాబు, నాగరాజు శ్రీనివాసరాజు, వెంకట్రాజు, కర్రి వెంకటేశ్వరావు ఎఇ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులతో ఇరిగేషన్ అధికారి చర్చించారు. సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని ఎఇ రైతులకు హామీ ఇచ్చారు.










