Aug 22,2023 22:06

హంద్రీనీవా పరివాహక రైతులు, కూలీలతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

           ఉరవకొండ : వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సాగునీటి రంగంపై అడుగడుగునా నిర్లక్ష్యం కొనసాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. హంద్రీనీవా కాలువ పనులను తక్షణం పూర్తి చేసి, రైతుల పొలాలకు సాగునీటిని అందించాలని కోరుతూ సిపిఎం పాదయాత్ర చేపట్టింది. మూడు రోజుల పాటు జరగునున్న పాదయాత్ర వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్‌హౌస్‌ వద్ద మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. రాగులపాడు హంద్రీనీవా పంప్‌ హౌస్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరు, కమలపాడు, కమలపాడు తండా మీదుగా మొదటి రోజు కొనసాగింది. పాదయాత్రను రాంభూపాల్‌ ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. హంద్రీనీవా కాలువ కింద జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. పాలకుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారన్నారు. వైసిపి రైతుసంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పడం కేవలం పేపర్‌ ప్రకటనలకే పరిమితమైందన్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు వారి సొంత ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాల చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. హంద్రీనీవా పిల్ల కాలువలు పూర్తి కాకపోవడంతో కళ్లెదుటే కాలువలో నీరు పారుతున్నా అవి రైతుల పొలాలకు చేరని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యంతో హంద్రీనీవా కాలువ కింద సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి డిస్ట్రిబ్యూటరీ పనులను తక్షణమే పూర్తి, సాగునీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాలలోని చెరువులు అన్నింటినీ హంద్రీనీవా నీటితో నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.శ్రీనివాసులు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాల రంగయ్య, రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, గుంతకల్‌ సిపిఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, వజ్రకరూరు మండల కార్యదర్శి విరుపాక్షి, నాయకులు నాగరాజు, రంగమ్మ, సుధాకర్‌, చరణ్‌ రాజు రైతులు పాల్గొన్నారు.