Aug 11,2023 21:37

తుంగభద్ర ప్రధాన కాలువకు పడిన గండిని పరిశీలిస్తున్న కాలవ శ్రీనివాసులు

          ప్రజాశక్తి-బొమ్మనహాల్‌    మండల పరిధిలోని 113 కి.మీ వద్ద తుంగభద్ర ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో శుక్రవారం టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు గండి పడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలవ విలేకరుల తో మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు గానీ, జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన హెచ్‌ఎల్‌సి కాలువకు రూపాయి కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ కాలువపై ఆధారపడి లక్షలా ది మంది రైతులు పంటలు సాగు చేస్తుండగా సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బొమ్మనహాల్‌, కణేకల్లు, డి.హీరేహాల్‌ మండలాల్లో ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే గండిని పూడ్చడంతో పాటు కాలువ మరమ్మతులు చేపట్టాని డిమాండ్‌ చేశారు. కాలవ వెంట టిడిపి మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.