ఇన్‌ఛార్జి జెసి సూర్యతేజ
ప్రజాశక్తి - ఆచంట
సాగునీరు ఆక్వా చెరువులకు మళ్లించకుండా సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు సాగాలని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ సూర్యతేజ అన్నారు. శనివారం ఆచంట, బాలంవారిపాలెం, ఆచంట వేమవరం, కొడమంచిలిలోని గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల సిబ్బందితో మాట్లాడారు. ముఖ్యంగా నీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ విడుదల చేసిన షెడ్యూల్‌ను అనుసరించి తొలుత తాగునీటి చెరువులు నింపాలన్నారు. నీటి సరఫరాపై సచివాలయం, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూర్యతేజ ఆదేశించారు. బాలంవారిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవన నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యులు ఇంటింటికీ వెళ్లి సేవలందిస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. సిహెచ్‌సి, పిహెచ్‌సిల్లో రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. ప్రభుత్వం అందించిన ఇళ్ల స్థలాలు, వాటిలో నిర్మిస్తున్న ఇళ్లు, నిర్మాణం ప్రారంభించని ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం తక్షణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని సూర్యతేజ ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌ఛార్జి తహశీల్దార్ రాజ్యలక్ష్మి, పంచాయతీ ఇఒ నాగబాబు, బాలంవారిపాలెం సచివాలయ సెక్రెటరీ పుచ్చకాయలు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, హౌసింగ్ ఎఇ శ్రీరాములు, నరేష్, ఆర్‌ఐ లలిత, విఆర్‌ఒ ఆచంట సీతారాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొడమంచిలిలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని సూర్యతేజ పరిశీలించారు.










