Oct 21,2023 23:33

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

* జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై నీటిపారుదలశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతాంగానికి సాగునీరందించాలని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆదేశించారు. జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. 1,2,4,7వ స్థాయీ సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ప్రధానంగా రైతాంగం సాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, వంశధార నదిలో నీటి నిల్వలు ఉన్నా సాగునీరు అందించలేకపోవడంపై రైతుల్లో ఆందోళన ఉన్నారని అన్నారు. పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలకు సాగునీరందడం లేదని జెడ్‌పిటిసి సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. అలాగే నారాయణపురం, తోటపల్లి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఉందన్నారని సభ్యులు తెలిపారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గృహ నిర్మాణశాఖ, సహకారశాఖ, డిసిసిబి, చేనేత, జౌళీశాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ, జిల్లా పంచాయతీశాఖ, జిల్లా నీటి యాజమాన్యశాఖ, పరిశ్రమలశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, విద్యాశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల పనితీరును సమీక్షించారు. అమదా లవలస-శ్రీకాకుళం రోడ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రస్తావించారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకటరామన్‌, జెడ్‌పిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.