Oct 16,2023 21:35

నిరసన తెలుపుతున్న గౌతు శిరీష

* టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
* జెడ్‌పి కార్యాలయం ఎదుట టిడిపి నిరసన
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. వంశధార ఎడమ కాలువ ద్వారా శివారు ప్రాంత భూములకు సాగునీరందించాలని కోరుతూ పలాస, వజ్రపుకొత్తూరు మండలాల రైతులతో కలిసి జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. వంశధార సాగునీటి కాలువలు నాలుగేళ్లుగా పూడిక పేరుకుపోయి గట్లు బలహీనపడ్డాయన్నారు. దీనికితోడు ఎగువ ప్రాంతంలో సాగునీటి వినియోగంపై నియంత్రణ కరువైందన్నారు. దీనివల్ల నాలుగేళ్లుగా శివారు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస మండలంలో వంశధార కాలువ ప్రారంభమైన టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి వద్ద గల వంశధార ప్రధాన ఎడమ కాలువకు సరైన నిర్వహణ లేక సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వంశధార సాగునీటిపై ఆధారపడిన సుమారు ఏడు వేల ఎకరాల వంశధార ఆధారిత భూముల రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని చెప్పారు. పలాస నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే శివారు భూములకు సాగునీరందించాలని రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం స్పందనలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్‌.మోహనరావు, వసంతస్వామి, పుచ్చ ఈశ్వరరావు, కె.రమణ, శివప్రసాద్‌, ఎ.షణ్ముఖరావు, రైతులు పాల్గొన్నారు.