Apr 08,2023 22:15

ప్రజాశక్తి - పోడూరు
             గుమ్మలూరు, రావిగొప్పు నక్కల డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న వంద ఎకరాల ఆయకట్టులో వరి పైరకు సాగునీరు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌, నేత రాపాక వెంకటేశ్వరావు డిమాండ్‌ చేశారు. నీరు లేక భూమి నెరలు తీసిన చేలో దిగి రైతులు సిపిఎం ఆధ్వర్యాన శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాట్లు సమయంలో వంతె నిర్మాణం కారణంగా ఒక నెల రోజులు సాగునీరు ఆలస్యంగా ఇచ్చారన్నారు. అందువల్ల ఆ ప్రాంతానికి ఇంకా సాగునీరు అవసరం ఉందన్నారు. పైరు పాలు పోసుకునే సమయానికి నీరు లేకపోతే రైతులు మొత్తం పంట నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు అందించకుంటే ఎకరానికి రూ.70 వేలు అధికారులు రైతులకు చెల్లించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌలురైతులు పైడి వెంకటేశ్వరరావు, చింతపల్లి సూర్యనారాయణ, దొంగ మసేను, ఈతకోట భాస్కరరావు, ఆకుమర్తి ప్రసాద్‌, వేండ్ర రాంబాబు, ఉన్నమట్ల బాలయ్య, ఆకుమర్తి పెద్దిరాజు, రాపాక రామకృష్ణ, ఏడుకొండలు, కండెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.