
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు పూర్తిస్థాయిలో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ రెండో వారంలోకి ప్రవేశించినా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు సాగవ్వలేదు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,67,643 ఎకరాల్లో పంటలు వేయగలిగారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 3,39,588 ఎకరాల్లో సాగవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంటలు సాగవ్వలేదని వ్యవసాయశాఖ నివేదికలు చెప్తున్నాయి. అందులో వరి పంటే 59 వేల ఎకరాలకు పైగా ఉంది. పంటలు సాగైనట్లు లెక్కలు చెప్తున్నా కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి. వర్షాధారంపై సాగవుతున్న మెట్ట ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సాగునీటి సౌకర్యం ఉన్న వంశధార ఆయుకట్టు రైతులకు ఈ దుస్థితి వచ్చిందంటే అది పాలకుల వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది. ఒడిశాలో కాస్తాకూస్తో వర్షాలు పడుతుండడంతో హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద తగినంత నీటి నిల్వలు ఉండనే ఉన్నాయి. కాలువల్లోకి నీటిని విడిచిపెడుతున్నా, అవి శివారు భూములను చేరడం లేదు. కాలువల్లో పెద్దఎత్తున పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్లుగా ఎప్పుడూ పూర్తిస్థాయిలో నీరిచ్చిన దాఖలాల్లేవు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో గుర్రపుడెక్క తొలగింపు, కాలువ అడుగ భాగాన కాంక్రీట్ పూతకు రూ.10 కోట్లు కావాలని వంశధార అధికారులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పైసా విదల్చలేదు.
వంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,450 క్యూసెక్కుల కాగా కాలువ గట్లు బలహీనంగా ఉండడంతో రెండు వేల క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టడం లేదు. అదేవిధంగా కుడి కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా 600 క్యూసెక్కులకు మించి వదలడం లేదు. సాగునీటి కాలువలు చాలా బలహీనంగా ఉండడం వల్లేనని అధికారులు సైతం చెప్తున్నారు. ఈ పరిస్థితి నుంచి నుంచి గట్టెక్కాలంటే వంశధార ఎడమ కాలువను ఆధునీకరించాలని చాలాకాలంగా అధికారులు చెప్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినా నాటి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఆంచనా వ్యయం అంతకంతకూ పెరిగి ఇప్పుడది రూ.953 కోట్లకు చేరింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండు మూడు పర్యాయాలు ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు.
షట్టర్ల కొనుగోళ్లలో అవినీతిపై 2009లో సిఐడి కేసు నమోదు చేయడంతో దీనిపై నేటికీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఘటన జరిగి 13 ఏళ్లు అవుతున్నా, అధకారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు. దీంతో కొత్త షట్టర్లు అమర్చలేక పాతవాటితోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా శివారు భూములకు సాగు నీరు అందని పరిస్థితిని చూస్తున్నాం ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిసారిస్తే సమస్య పరిష్కారమవుతుందని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదు. వంశధార కాలువల ద్వారా సాగునీరందకపోవడానికి ఉన్న కారణాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపక్ష టిడిపిపై నెట్టేస్తున్నారు. నీరు-చెట్టు అవినీతి వల్లే సాగునీటి సమస్యలు తలెత్తాయంటూ నిందిస్తున్నారు. పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తమ ప్రాంతంలోని శివారు భూములకు నీరందడం లేదని టెక్కలి నియోజకవర్గంలోని మూడు వేల ఎకరాలకు నీరందించే 16 ఎత్తిపోతల పథకాలకు ఏకంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వంశధార ఆధునీకరణ, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయించి శివారు భూములకు నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాల్సిన మంత్రి అప్పలరాజు ఎత్తిపోతల పథకాలకు నీరు ఆపేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి కరుణించక, ప్రభుత్వం నిధులు విదల్చక ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు వేయలేకపోయారు. వర్షాల్లేక, కాలువల ద్వారా సాగునీరు రాక పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. కరువుఛాయలు అలుముకుంటున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు దూషించుకోవడం మాని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది.