సాగుభూములకు దరఖాస్తు పట్టాలు
ప్రజాశక్తి -ఎస్‌ఆర్‌పురం: రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించి వారు సాగుచేస్తున్న భూములకు దరఖాస్తు పట్టాలు అందించాలనే ధ్యేయమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. గురువారం ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఎస్‌ఆర్‌పురం గ్రామపంచాయతీ దాసరిగుంటలో దరఖాస్తు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సాగు చేస్తున్న భూములకు దరఖాస్తు పట్టాలు అందించాలని అధికారులు భావించిన వెంటనే ప్రభుత్వం అంగీకరించడం మూడు నెలల పాటు రెవెన్యూ అధికారులు నిర్విరామంగా కషిచేసి సిజెఎఫ్‌ఎస్ హక్కులు ఉన్న దళిత కుటుంబాలకు న్యాయం చేసే ఉద్దేశంతో నేడు 194 మందికి భూ యజమాన్యపు దరఖాస్తు హక్కులను ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ హక్కు పత్రాలను పొందడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీరు పొందడానికి వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఈపథకాలను అందించడానికి అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. రానున్న కాలంలో మరింత మందికి ఈ సౌకర్యం కల్పించబడుతుందన్నారు. మండలంలోని దాసరిగుంట గ్రామ పరిధిలోగల 56 కనికాపురం, సి.కే.పురం గ్రామాలకు చెందిన 194 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా దరఖాస్తు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో రేణుక, తహశీల్దార్ షబ్బీర్‌బాషా, ఎంపీడీఓ పార్వతమ్మ, చిత్తూరు డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సర్పంచ్ హరిత కుప్పయ్యతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.










