
* 70 వేల ఎకరాల్లో పంటలు వేయని పరిస్థితి
* 59 వేలకు పైగా ఎకరాల్లో సాగు కాని వరి
* ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు
* జిల్లాలో ఆరు మండలాల్లో కరువుఛాయలు
సెప్టెంబరు రెండో వారం పూర్తవుతున్నా, రైతులు పూర్తిస్థాయిలో విత్తనాలు వేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నా, సాగు లక్ష్యాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనపడడం లేదు. జిల్లాలో నేటికీ ఆరు మండలాలు తీవ్ర వర్షపాతం లోటులోనే కొనసాగుతున్నాయి. సాధారణ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లోనూ పరిస్థితులు క్లిష్టతరంగానే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంటలు సాగవ్వలేదని వ్యవసాయశాఖ నివేదికలు చెప్తున్నాయి. అందులో వరి పంటే 59 వేల ఎకరాలకు పైగా ఉంది. పంటలు సాగయినట్లు లెక్కలు చెప్తున్నా, కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,67,531 ఎకరాల్లో (84 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 3,39,468 ఎకరాల్లో (85 శాతం) సాగైంది. మొక్కజొన్న పంటను ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణం వేయాలని అనుకోగా, 23,593 ఎకరాల్లో (89 శాతం) వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 2,675 (58 శాతం) మేర వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 1,320 ఎకరాలు (29 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 93 ఎకరాలు (28 శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1333 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా, ప్రస్తుతం 273 ఎకరాల్లో (20 శాతం) వేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 13 ఎకరాలు (ఐదు శాతం), మినుములు 273 ఎకరాల్లో రైతులు విత్తనాలు వేస్తారని అంచనా వేయగా ఇప్పటివరకు పది (నాలుగు శాతం) ఎకరాల్లోనే వేయగలిగారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో దుర్భిక్ష పరిస్థితులు
జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో కలిపి మొత్తం 33,723 ఎకరాలు సాధారణ సాగుగా ఉంది. ఇప్పటివరకు 16,653 ఎకరాల్లోనే (49.38 శాతం) పంటలు వేయగలిగారు. వరి పంట సాధారణ సాగు 33,660 ఎకరాలు కాగా, ప్రస్తుతం 17,048 ఎకరాల్లో వరి (50.65 శాతం) వేయగలిగారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కుంటున్న నియోజకవర్గాల్లో టెక్కలి కూడా ఉంది. నియోజకవర్గంలో అన్నిరకాల పంటలు కలిపి మొత్తం 75,915 ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 64,603 ఎకరాల్లో వేయగలిగారు. వరి పంట 75,578 ఎకరాల్లో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 11,438 ఎకరాల్లో విత్తనాలు పడలేదు.
ఆరు మండలాల్లో కరువుఛాయలు
జిల్లాలో ఇప్పటివరకు కురిసిన వర్షపాతం మేరకు ఆరు మండలాల్లో కరువుఛాయలు అలుముకున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గం నాలుగు, పలాస, ఎచ్చెర్ల మండలాల్లో చెరొక మండలాలు ఉన్నాయి. వాటిలో కవిటి (47.6 శాతం), ఇచ్ఛాపురం (44.2 శాతం), కంచిలి (43.7 శాతం), సోంపేట (34 శాతం) మండలాలు తీవ్ర వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. మిగిలిన రెండింటిలో నందిగాం (24.7 శాతం), జి.సిగడాం (23.7 శాతం) లోటులో ఉన్నాయి.
నియోజకవర్గాల వారీగా పంటల పరిస్థితి ఇలా...
నియోజకవర్గం పంటలు వేయని వరి వేయని
భూముల విస్తీర్ణం భూముల విస్తీర్ణం
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
ఆమదాలవలస 8,093 5,595
ఎచ్చెర్ల 8,428 3,453
ఇచ్ఛాపురం 17,070 17,048
నరసన్నపేట 9,575 8,360
పలాస 3,165 2,988
పాతపట్నం 7,295 6,710
శ్రీకాకుళం 4,570 3,815
టెక్కలి 11,438 11313
మొత్తం 69,634 59,282