
*జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
*ఉత్సాహంగా యువజనోత్సవాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్:సాధన ద్వారా యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెట్‌శ్రీ ఆధ్వర్యాన జిల్లాస్థాయి యువజనోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రారంభమైన వేడుకల్లో యువతీ యువకులు పలు నృత్యాలను ప్రదర్శించారు. ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం జెసి మాట్లాడుతూ యువత మంచి మార్గం వైపు పయనించి పోటీలో నిలదొక్కుకోవాలన్నారు. ప్రతి వ్యక్తి పుట్టుకతో గొప్పవారు కాలేరని, వారి శ్రమ, పట్టుదల, దీక్ష వారిని ఉన్నత స్థితికి చేరుస్తాయన్నారు. వ్యక్తిత్వ వికాసానికి యువజనోత్సవాలు దోహదపడతాయన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ధడమైన సంకల్పం క్రమ శిక్షణతో మెలగాలన్నారు. ఆయన బోధనలను నిరంతరం చదువుతూ వాటిని అలవాట్లుగా మార్చు కోవాలన్నారు. గత ఏడాది జిల్లా నుంచి ఎంపికైన బృందాలు జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి అందర్ని ఆకట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా యువజనోత్సవాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. జాతీయ యువజనోత్సవాలలో జిల్లా యువత ప్రతిభ చూపాలన్నారు. యువతకు అనేక రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్, వయోజన విద్య ఉప సంచాలకులు ఎం.వెంకటరమణ, ఉపాధి కల్పనాధికారి సుధ, ఇంటెక్ సభ్యులు రాధా ప్రసాద్, ఎన్‌వైకె కోఆర్డినేటర్ వెంకట్ ఉజ్వల్, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యచంద్రరావు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.