- కమిషనర్ రమణారెడ్డి
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : సమస్త జీవవాళి మనుగడకు అవసరమైన పర్యావరణాన్ని పరిరక్షించుకుని, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిఒక్కరూ బాధ్యతగా పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ రమణారెడ్డి ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, గ్రామ/వార్డు సచివాలయ విభాగాల సంయుక్తాధ్వర్యంలో "పర్యావరణహిత జీవనశైలి" (Lifestyle For Environment) పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఉదయం 2 కె రన్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ కూడలి తిరిగి నగరపాలక కార్యాలయం వరకు నిర్వహించారు. కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్లు వాసంతి , విజయభాస్కర్ రెడ్డి, కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో టవర్ క్లాక్ కూడలి వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మనందరి దైనందిన అలవాట్లలో చిన్న చిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై నియంత్రణ, జౌళి సంచుల వాడకం, విద్యుత్ ఆదా, సోలార్ వస్తువుల వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ, తక్కువ దూరాలకు సైక్లింగ్, ఎలివేటర్ బదులుగా మెట్లను వాడటం వంటి చర్యలతో మార్పుకోసం ప్రయత్నించాలని కమిషనర్ కోరారు










