Jun 28,2023 12:14

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు  పెనుమంచిలి పంచాయతీ పరిధి వర్దనపు గురువు -- రొక్కాల గురువు రహదారి నడవడానికి కూడా వీలు లేని రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని రహదారులతో ఇక్కట్లుకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు  గురవుతూనే అద్వాన రోడ్లపై రాకపోకలు సాగిస్తూ కాలం గడుపుతున్నారని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి పూర్తిగా దెబ్బ తినడంతో పాదచారులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు అని అన్నారు. తక్షణమే ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అధికారులు స్పందించి, దళిత వాడల రహదారులకు నిధులు కేటాయించి  నిర్మాణాలు చేపట్టాలని లేనిపక్షంలో  దళితులను సమీకరించి ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.