ర్యాంకుల కోసమే లీకేజీలు
నారాయణకు సంకెళ్లు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
ర్యాంకుల కోసమే నారాయణ లీకేజీలు చేస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగా ఆయన్ను అరెస్టు చేసి 408, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది రుజువైతే ఆయనకు పదేళ్ల కారాగార శిక్ష తప్పేటట్లు లేదు.
కథ ఇలా మొదలు
గంగాధరనెల్లూరు మండలంలోని నెల్లేపల్లె పరీక్షా కేంద్రం వద్దకు ఏప్రిల్ 27వ తేదీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సోము వెళ్లారు. ఒకటో గదిలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్ కుమార్‌రెడ్డి సహకారంతో తెలుగు ప్రశ్నపత్రాన్ని తన సెల్‌ఫోనుతో ఫొటో తీసుకున్నారు. దీన్ని 9.37 గంటలకు చంద్రగిరిలోని శ్రీకష్ణారెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్‌కు వాట్సాప్‌లో పంపారు. దీనిని సురేష్ తిరుపతిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ప్రతినిధి సుధాకర్‌కు పంపాడు. సుధాకర్ తిరుపతిలోని చైతన్య స్కూల్ డీన్ మోహన్‌కు, తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్‌ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డికి పంపాడు.ఆ తర్వాత మోహన్ తిరుపతిలోని చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అరిఫకు పంపారు. ఇలా వచ్చిన ప్రశ్నపత్రాన్ని గిరిధర్‌రెడ్డి పొరపాటున చిత్తూరు టాకీస్ అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయింది. దీనిపై ఎస్పీ రిషాంత్‌రెడ్డికి చిత్తూరు డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. చిత్తూరు పోలీసులు తొలుత గిరిధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అతడి నుంచి వివరాలు రాబట్టి మరో ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులున్నారు.
అడ్మిషన్లు కోసమే అంతా...
విచారణలో కార్పొరేట్ విద్యాసంస్థలైన చైతన్య, నారాయణ, శ్రీక్రిష్ణరెడ్డి చైతన్య మరియు ఎన్‌ఆర్‌ఐ అకాడమి వారి విద్యార్థులకు అధిక మార్కులు రప్పించి, వారి సంస్థలకు మంచి ప్రాచుర్యం అధిక మొత్తంలో అడ్మిషన్ల పొందేందుకు ఒక నేరపూరిత సంఘంగా ఏర్పడి అక్రమ మార్గంలో పదవ తరగతి పబ్లిక్ పరిక్షల ప్రశ్నాపత్రంను నిబంధనలకు విరుద్ధంగా బహిర్గతం పరచి నేరానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఉన్నటువంటి అన్ని నారాయణ బ్రాంచ్‌లలో చదువుతున్న 10వ తరగతి విద్యార్దులు ఎక్కువగా జెఇఇ మరియు నీట్‌లలో ఎక్కువగా మార్కులు సాధించాలని లాంగ్వేజ్‌లు మినహా మిగిలిన సబ్జెక్టులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ కోచింగ్ ఇస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఏడాది ఎక్కువ రోజులు ప్రాముఖ్యమైన సబ్జెక్ట్‌లలో భోదిస్తున్నారు. మిగిలిన వాటిల్లో కూడా మార్కులు ఎక్కువగా చూపించడానికి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అన్ని స్కూళ్ళ డీన్‌లతో, ప్రిన్సిపల్స్‌తో, వైస్ ప్రిన్సిపల్స్ తో సమావేశమై నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని నిర్ణయిస్తారు.
తద్వారా తదుపరి సంవత్సరం ఎక్కువ అడ్మిషన్లు వచ్చే విధంగా చేయాలనే దురుద్దేశంతో విద్యార్థులకు వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించి పెట్టవలెనని, ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి, ఇన్విజిలేటర్‌గా ఉండే ఎవరైనా కొంతమంది ప్రభుత్వ టీచర్ల సహకారంతో వారికి ఐదు లేక పదివేలు డబ్బులు ఇచ్చి, వారి పిల్లలకు ఉచితంగా అడ్మిషన్‌లు ఇస్తామని చెప్పి, వారి ద్వారా ఎలాగైనా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేయవలేనని ఆలోచనతో ఒక పథకం వేసి అమలు చేస్తున్నారు.ఇలా విచారిస్తున్న క్రమంలో ఈ తీగ మాజీ మంత్రి వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.










