Sep 19,2023 21:22

రూటు మారిన రాజ కాలువ..!
ప్రశ్నించిన టిడిపి నాయకులు
ప్రజాశక్తి- పలమనేరు:

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో రాజ కాలువను కుదించి జరుగుతున్న అక్రమనిర్మాణాలు ఆపాలని, ఆరడుగుల విస్తీర్ణమున్న రాజ కాలువను పునరుద్ధరించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ టిడిపి నాయకులు నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అడ్డుగా ఉందని కాలువ కుదింపు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఉన్న కాలువను కడితే ఎవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. కొంతమంది కోసం నిబంధనలు గాలికి వదిలి ఇష్టారాజ్యం గా వ్యహారించటం జరిగిందన్నారు. కంచే చేను మేసిన చందంగా పలమనేరు మున్సిపల్‌ అధికారుల నిర్వాకం ఉందన్నారు. ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలపై కేసు నమోదు హెచ్చరికలు చేయడం వంటివి దేనికి సంకేతం అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? ప్రజలకు తెలియచేసే బాధ్యత ప్రతిపక్షాలపై లేదా...అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే శ్రీరామ రక్షగా నిలబడటం సిగ్గు చేటని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలోనే తెల్చుకుంటామని రానున్న ఎన్నికల్లో టిడిపి అధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. నాయకులు ఆర్‌బిసి కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడు, నాగరాజు,ఖాజా, మదన్‌, సుధాకర్‌, పర్వీన్‌ పాల్గొన్నారు.