Jun 17,2023 22:14

ప్రజాశక్తి - కాళ్ల
            ఉప్పుటేరు తీర ప్రాంత ప్రజలకు చేయూతనిస్తూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుని కలవపూడి సొసైటీ లాభాల బాటలో నడుస్తోంది. గత 13 ఏళ్లుగా ప్రజలకు, రైతులకు ఇచ్చిన రుణాలు నూరుశాతం వసూలు చేసి సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి జిల్లా ఉత్తమ సహకార సంఘంగా ముందంజలో ఉంటూ... అవార్డులు పొందుతూ మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలిచింది. ఉప్పుటేరు తీర ప్రాంతంలో కలవపూడి గ్రామంలో సొసైటీ 1956లో 9 మంది సభ్యులతో ప్రారంభమై నేడు 2545 మంది సభ్యులతో ఉంది. ప్రారంభంలో రూ.15 షేర్‌ ధనంతో సొసైటీ ఏర్పడింది. ప్రస్తుతం రూ.64.50 లక్షల షేర్‌ ధనం కలిగి ఉంది.
క్రమశిక్షణతో సొసైటీ నిర్వహణ
బ్యాంకు వ్యవస్థాపకుల స్ఫూర్తి అడుగడుగునా మూర్తిభావిస్తూ బాధ్యతాయుతంగా క్రమశిక్షణగా సొసైటీ అధ్యక్షుల, సిబ్బంది కృషి ఉంది. రైతులకు అన్నివిధాలా రుణాలు మంజూరు చేస్తూ వారికి ఆపన్నహస్తం అందించి వారిచే సిరుల పంటలు పండించేందుకు సొసైటీ తోడ్పడుతోంది. ప్రస్తుతం సొసైటీ ప్రగతి బాటలో పురోగమిస్తూ ప్రజాసేవలో తరిస్తోంది.
వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లు
సహకార బ్యాంకులో వార్షిక టర్నోవర్‌ రూ.పది కోట్ల వ్యాపారం నడుస్తోంది. పంట రుణాలు, బంగారు ఆభరణాలు, చేపల మేత వివిధ రకాల రుణాలు మంజూరు చేస్తూ రైతులకు, ప్రజలకు చేయూతనిస్తూ రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటూ సొసైటీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రాతళ్లమెరక, పల్లిపాలెం, ఎస్‌సి బోస్‌ కాలనీ, మాలవానితిప్ప, గోగుతిప్ప, ఇసుకలంక, కలవపూడి, మోడీ గ్రామాల రైతులకు, ప్రజలకు సేవలందిస్తోంది. 2022-23 సంవత్సరంలో సంఘ సభ్యులకు, రైతులకు, వివిధ రకాల రుణాలు రూ.6.44 లక్షల రుణాలు అందించారు. సంఘ పరిధిలో ఉన్న ప్రాతళ్లమెరక, పల్లిపాలెం, ఎస్‌సి బోస్‌ కాలనీ, మాలవాని తిప్ప, ఇసుకలంక, కలవపూడి, గోగుతిప్ప, మోడీ పరిధిలో ఉన్న రైతులకు, ప్రజలకు రుణాలు సొసైటీ అందిస్తోంది. 2022- 2023 సంవత్సరానికి సంబంధించి రైతుల నుంచి రూ.6.44 కోట్లు నూరు శాతం వసూలు చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ రిపోర్ట్‌ పూర్తి చేసిన జిల్లాలోని మొదటి సంఘంగా ఉంది.
రూ.38 లక్షల నికర లాభం
రామవెంకటసత్యనరసింహరాజు(మణి), సొసైటీ సిఇఒ
సొసైటీలో జాతీయ బ్యాంకులకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌, బ్యాంకు రుణాల అందజేత, లాకర్‌ సదుపాయాలు ఉన్నాయి. అధ్యక్షులు, సిబ్బంది కృషి, సభ్యుల సహకారంతో ఇచ్చిన అప్పులు నూటికి నూరు శాతం బకాయిలు వసూలు చేసిన జిల్లాలోని మొదటి సంఘంగా నిలిచింది. సంఘం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2022-23లో రూ.38 లక్షల నికర లాభం వచ్చింది. డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తాం.
రైతుల సంక్షేమమే లక్ష్యం
పెన్మెత్స దుర్గాప్రసాదరాజు, త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. ఆక్వా రైతులకు జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ కల్పించింది. ఈ ప్రాంతంలో నూరుశాతం ఆక్వా రంగం ఉంది. ఉప్పుటేరు తీర ప్రాంత ప్రజలకు, రైతులకు ఈ సొసైటీ ద్వారా అన్ని రకాల రుణాలు అందిస్తున్నాం. డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు కలవపూడి సొసైటీకి ప్రత్యేక శ్రద్ధతో సహకారం అందిస్తున్నారు.