కోపల్లె హైస్కూల్ పూర్వ విద్యార్థులు
ప్రజాశక్తి - కాళ్ల
కోపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల విరాళాలు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నామని పూర్వవిద్యార్థి కొత్తపల్లి బంగార్రాజు అన్నారు. ఆదివారం కోపల్లె హైస్కూల్ పూర్వ విద్యార్థులు (1967-1972) హైస్కూల్లో కలిసి తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ వృత్తులు, వ్యాపారులు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. సుమారు వంద మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులైన కృష్ణంరాజు, అప్పలరాజును సత్కరించారు. కోపల్లె హైస్కూల్‌ను జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దాలని, తమ వంతు ఆర్థిక సహాయం అందించి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పూర్వ విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేశారు. కోఆర్డినేటర్‌గా కొత్తపల్లి బంగార్రాజు, సభ్యులుగా చిలకలపల్లి కట్లయ్య, వేగేశ్న రామరాజు, సిహెచ్‌ఎన్.శంకర్రావు, జవ్వాది సత్యనారాయణ, రెడ్డిపల్లి సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జక్కరం గ్రామ సర్పంచి కూచంపూడి పద్మావతి లక్ష్మీపతిరాజు, వేగేశ్న పుష్పవతి, పి.సత్యనారాయణరాజు, మంతెన సుబ్బరాజు, కోపల్లె హైస్కూల్ ఉపాధ్యాయుడు గాదిరాజు కనకరాజు పాల్గొన్నారు.










