Apr 23,2023 21:14

దానిమ్మ చెట్లకు నిప్పు..

        బెలుగుప్ప : మండల కేంద్రానికి చెందిన రైతు ఎల్‌.గోపాల్‌రెడ్డి సాగు చేస్తున్న 20 ఎకరాల్లో ఉన్న దానిమ్మ చెట్లకు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో చెట్లుపూర్తిగా కాలిపోయి సుమారు రూ.4.50లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయారు. వివరాల్లోకి వెళ్తే... రైతు గోపాల్‌రెడ్డి మండల కేంద్రం సమీపంలోని 88 సర్వేనెంబర్‌లోఉన్న 20 ఎకరాల్లో 800 దానిమ్మ చెట్లు సాగు చేశారు. ఇందుకోసం సుమారు 4లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిబూడిదైనట్లు వాపోయాడు. దీనికితోడు 60 కట్టలు డ్రిప్‌ వైర్లు కాలినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గమణించిన స్థానికులు అగ్నిమాపక యంత్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా రైతు గోపాల్‌ రెడ్డి కుమారుడు ఓపిరెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా కోత దశకు వచ్చిన అరటి చెట్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్పుట్లో కూడా రూ.లక్షల్లో నష్టపోయామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణయ్య తెలిపారు.