Oct 14,2023 20:55

స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి

స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి
రూ.20 వేల కోట్లతో మత్స్యరంగానికి ప్రోత్సాహం
-కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రూ.20 వేల కోట్లతో మత్స్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు.శనివారం నెల్లూరునగరంలోని వి.ఆర్‌.సి మైదానంలో సింహపురి సేంద్రియ మేళా (ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం) రెండవ రోజు కార్యక్రమంలో ఆయన, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ముందుగా ఈ మేళాలో ఏర్పాటు చేసిన సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను మంత్రులు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడమే కాకుండా అత్యధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు.
అందులో భాగంగా రూ.2500కోట్లతో ప్రాజెక్టుల స్థాపనకు అనుమతులు మంజూరు చేశామన్నారు. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్టులు రాష్ట్రంలో స్థాపించేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. కష్ణపట్నం వద్ద ఫిషింగ్‌ జెట్టిని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సాగర్‌ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా జలమార్గంలో ప్రయాణిస్తూ రాష్ట్రంలోని కష్ణపట్నం పోర్టుకు ప్రవేశించినట్లు చెప్పారు. ఈ సాగర్‌ పర్యటన ద్వారా తీర ప్రాంతాల్లో హార్బర్ల స్థితిగతులు, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక వసతుల కల్పనపై నిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందన్నారు. మత్స్యకార రంగానికి గత ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంలో కొత్తగా మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు. అటువంటి శాఖకు తనను మంత్రిగా నియమించిన అనంతరం పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ మత్స్యకారుల అభివద్ధికి కషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 8 వేల కిలోమీటర్ల పరిధిలో తీరప్రాంతం ఉందన్నారు. ఆ ప్రాంతాన్ని నమ్ముకొని సుమారు 3 కోట్ల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఎపిలో 30 శాతం మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందని, ఇది దేశంలోనే అత్యధికమన్నారు. ప్రజలు ఢిల్లీ చుట్టూ తిరగకుండా మంత్రులే ప్రజల వద్దకు వచ్చి వారికి అవసరమైన అభివద్ధి పనులు చేపట్టేలా చేసిన ఘనత ప్రధాన మంత్రి కే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో ఎపి ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహారంలో మత్స్య ఉత్పత్తులు భాగం కావాలని, వివిధ ప్రోటీన్లతో కూడిన చేప ఉత్పత్తులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. గుజరాత్‌ కు చెందిన అమూల్‌ మిల్క్‌ కోపరేటివ్‌ సొసైటీ తన ఉత్పత్తులను విస్తతంగా మార్కెటింగ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అదే తరహాలో మత్స్య ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేలా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు చొరవ తీసుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్యకార రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అన్ని నగరాల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ను ఏర్పాటు చేయాలని మత్స్యకార సంక్షేమ సమితి నిర్వాహకులను కోరారు. అనంతరం పలు సమస్యలపై మత్స్యకార సంఘ నాయకులు కేంద్రమంత్రికి అర్జీలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు బీద మస్తాన్‌ రావు, జివిఎల్‌ నరసింహారావు,మత్స్య శాఖ కమిషనర్‌ కన్నబాబు,ఆప్కాప్‌ చైర్మన్‌ అనిల్‌ బాబు, ఇన్చార్జి కలెక్టర్‌ రోణంకి కూర్మనాధ్‌, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు,మత్స్యకార సంక్షేమ సమితి నిర్వాహకులు పోలయ్య తదితరులు పాల్గొన్నారు.