రూ.19లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం
ముగ్గురు దొంగలు అరెస్టు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరుటౌన్‌లోని గవర్నమెంట్ ఆసుపత్రి, బ్రాహ్మణవీధి, జానకారపల్లి, సంతపేటలోని, గాండ్లవీధి ఇంకా కొన్నిప్రాంతాలలో రాత్రి సమయాల్లో ఇళ్ళ ముందర పార్కింగ్ చేసి ఉంచిన మోటార్ సైకిళ్ళను ఎవరో గుర్తుతెలియని వారు దొంగలించుకొని పోయినారని సంబంధిత మోటార్ సైకిల్ యజమానులు కంప్లైంట్ ఇచ్చారు. వాటిపై చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేయడమైనది. ఎస్‌పి రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్‌పి సుధాకర్ రెడ్డి, సబ్-డివిజినల్ పోలీస్ ఆఫీసర్, చిత్తూరు పర్యవేక్షణలో చిత్తూరు టౌన్ నందు వరుసగా దొంగతనం కాబడుతున్న మోటార్ సైకిళ్ళ దొంగలను చేధించి పట్టుకోవడం కోసం చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్‌పెక్టర్ యతీంద్ర, ఎస్‌ఐ మల్లికార్జున, లోకేష్, సిబ్బంది కలసి రెండు బందాలుగా ఏర్పడి, ఈకేసులను చేధించేందుకు మోటార్‌సైకిళ్ళ దొంగలను పట్టుకొనుటకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు ప్రారంభించడమైనది. మంగళవారం మధ్యాహ్నం 1గంటలకు చిత్తూరు టూటౌన్ సబ్-ఇన్స్‌పెక్టర్‌కి ఇన్ఫార్మర్‌ల ద్వారా రాబడిన సమాచారం మేరకు చిత్తూరు సబ్-ఇన్స్‌పెక్టర్ లోకేష్, సిబ్బందితో కలసి చిత్తూరు టౌన్, చిత్తూరు- వేలూరు రోడ్డులోని రెడ్డిగుంట జంక్షన్ సమీపంలో ఉన్న డిఆర్‌డిఎ ఆఫీసు ఎదురుగా వాహనాలు తనిఖీ చేయుచుండగా అక్కడ ఈ కేసులకు సంబంధించిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన తెన్నరసు, బాలాజి, అశ్వన్ అనే ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ముద్దాయిల నుండీ సేకరించిన సమాచారం మేరకు 19లక్షల విలువ చేసే మోటరు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాల చోరిలో మరో ముద్దయి మణిగండన్ పరారీలో ఉన్నట్లు డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి తెలిపారు.










