సర్పంచి, కార్యదర్శిపై సభ్యుల ఆరోపణలు
ఎంపిడిఒకు వినతిపత్రం అందించిన వైనం
ప్రజాశక్తి - పాలకోడేరు
పాలకోడేరు గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం రసభాసగా సాగింది. పరస్పర ఆరోపణలు, విమర్శల, వాగ్వివాదాల మధ్య సాగింది. సర్పంచి ఇంజేటి మరియమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి రమాలీల సోమవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు మాట్లాడుతూ ఎన్నికై రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయామని వాపోయారు. మొదటి సమావేశంలో తీర్మానించిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. అసలు గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం వస్తుందో, ఖర్చులు ఎంతో తదితర విషయాలపై అడిగినా కార్యదర్శి రామలీల తమకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదని సభ్యులు ఆరోపించారు. సర్పంచి భర్త లక్ష్మీపతి పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సిబ్బంది, పాలకవర్గ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సర్పంచి మరియమ్మ మాట్లాడుతూ కార్యదర్శితో పాటు సిబ్బంది తనను గౌరవించడం లేదని వాపోయారు. గత మూడేళ్లుగా పంచాయతీ ఆదాయ వ్యయాలపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని సభ్యులు కోరారు. అప్పటివరకు తాము పంచాయతీ సమావేశాలకు హాజరు కామని స్పష్టం చేశారు. సర్పంచి మరియమ్మ కార్యదర్శి రమాలీల మధ్య సమన్వయం రాకపోవడం వల్ల గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అధ్వానంగా మారాయన్నారు. గ్రామంలో వారం రోజులుగా ఆలం కలపకుండా తాగునీటిని సరఫరా చేయడంపై సభ్యులు తప్పుపట్టారు. ఆలం కొనుగోళ్లకు సంబంధించి గత బిల్లులు మంజూరు చేయకపోవడంతో గుత్తేదారుడు సరఫరా నిలిపివేశారని పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితమే ఆలం నిల్వలు అయిపోయాయని, కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీ తాగునీటి సరఫరా విభాగంలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించడాన్ని సర్పంచి తప్పుపట్టారు. ఈ నెల అతనికి వేతనం నిలిపివేయాలంటూ కార్యదర్శికి సర్పంచి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతనితోపాటు పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి కార్యదర్శి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు బిల్లు చేయలేదు. దీనిపై పంచాయతీ సభ్యులంతా కార్యదర్శి తీరును నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోపణలు చేశారు. సర్పంచి లిఖిత పూర్వకంగా ఆదేశాలిస్తే పంచాయతీ సిబ్బందికి వేతనాలు బిల్లులు చెల్లిస్తానని కార్యదర్శి తెలిపారు. తాను దళిత సర్పంచినని కావాలనే తనపై లేనిపోని ఆరోపణ చేస్తూ వివక్ష చూపుతున్నారని సర్పంచి మరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారన్నారు.
సర్పంచి భర్త రూ.రెండు లక్షల లంచం అడిగారు
పి.రామకృష్ణ, పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు
తను గత 15 ఏళ్ల నుంచి పంచాయతీలో ఫిట్టర్‌గా ఉన్నప్పటికీ పంచాయతీ కార్యాలయం పనులు నిర్వహిస్తున్నానని పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్స్ మండల అధ్యక్షుడు, సిఐటియు మండల ఉపాధ్యక్షులు పి.రావకృష్ణ తెలిపారు. ఇటీవల సర్పంచి భర్త లక్ష్మీపతి తాను పోస్టులో ఉండాలంటే రూ.రెండు లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. ఇవ్వకపోతే పోస్టు నుంచి తొలగిస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పంచాయతీ కార్మికుడిగా యూనియన్ నాయకుడిగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురిచేసి వేతనం కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారని ఆరోపించారు. పంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మండలంలో పంచాయతీ కార్యాలయంలో అనేకమంది అనేక ఇబ్బందులు, అవమానాల మధ్య విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ సిఐటియు అండగా ఉంటుందని పేర్కొన్నారు.










