Oct 12,2023 20:52

ధర్నా చేస్తున్న మత్స్యకారులు

* తొలగించాలని బాధిత గ్రామస్తుల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పెద్దగణగళ్లవానిపేట, పుక్కళ్లవానిపేటకు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామాల మత్స్యకారులు కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ రొయ్యల చెరువులతో గ్రామాల్లో మంచినీటి బావులు ఉప్పునీరుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల చెరువుల నీరు సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్యసంపద మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సముద్రానికి 500 మీటర్ల లోపు రొయ్యల చెరువులు ఉండకూడదన్న నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు. మత్స్యకారులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లుతున్నా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఈ చెరువుల వల్ల నష్టాన్ని మత్స్యకారులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీటి చెరువుకు 15 మీటర్ల దూరంలో రొయ్యల చెరువులు తవ్వారని తెలిపారు. తక్షణమే ఈ ప్రాంతాల్లో రొయ్యలు, చేపల చెరువులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో మత్స్యకార నాయకులు మైలపల్లి నర్సింగరావు, సూర్యనారాయణ, బర్రి కృష్ణ, సర్పంచ్‌ బర్రి రామారావు, ఎంపిటిసి చీకటి అమ్మోజీరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ పుక్కల రామారావు, గనగళ్ల కామయ్య, మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.