రోజాకు అసమ్మతి సెగ
ప్రోటోకాల్ విషయంలో రగడ
మంత్రి ఆవేదన
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు అసమ్మతి సెగ తగులుతోంది. ఓ భవన భూమిపూజ వ్యవహారంలో ఆమె ప్రమేయం లేకుండా చేయడంపై స్వయానే రోజానే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తన ప్రమేయం లేకుండానే ఇలా చేస్తున్నారని ఆమె వాపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో మరోసారి చర్చలోకి వచ్చింది. నిండ్ర మండలంలో కొప్పేడు గ్రామం చక్రపాణిరెడ్డి సొంత గ్రామం. ఇక ఆర్‌బికె కేంద్రానికి భూమిపూజను సోమవారం నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై రెండు, మూడు రోజులుగా ఈ ప్రాంతంలో వార్తలొస్తున్నాయి. దీనిపై మంత్రికి ఎలాంటి సమచారం లేకుండా భూమిపూజ నిర్వహించారు. దీంతో ఇక్కడ విబేధాలు ఒక్క సారిగా చర్చలోకి వచ్చాయి.
మంత్రి రోజా ఆది నుంచి సొంత నియోజకవర్గంలో దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తాను అనుకున్న వారిని కాకుండా వేరే వ్యక్తులను ప్రతిపాదిచడంపైనా ఆమె పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే తిరిగీ ఇప్పుడు నిండ్ర మండలంలో భూమిపూజ వ్యవహారంలో కూడా మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. దీనిపైన స్వయానా మంత్రే ఇక్కడి నాయకులపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీనం చేసేలా టిడిపి, జనసేనలకు మద్ధతిస్తూ తను నష్టం జరిగేలా, పార్టీని దిగజారుస్తూ అసమ్మతి వర్గం భూమి పూజ చేయడం ఏంటి..? ఇది కరెక్టేనా..? ఆలోచించండి. ఇలాంటి వాళ్లుంటే రాజకీయాలు చేయడం కష్టం అంటూ ఆవేదన వెల్లుబుచ్చారు. దీన్ని తన మద్ధతుదారుల వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారు. ఇది సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.










