రోగులకు సత్వర సేవలు అందించాలి
ప్రాజెక్టు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎపిఎస్‌ఎసిఎస్ నవీన్‌కుమార్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ :
రోగులకు సత్వరసేవలు అందించాలని ప్రాజెక్టు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎపిఎస్‌ఎసిఎస్ నవీన్‌కుమార్ అన్నారు. మంగళం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భగా పలు విభాగాలను పరిశీలించారు. స్పెషల్ సెక్రటరీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసీటీసీ కేంద్రాలలో రోగుల వివరాలు సంతప్తికరంగా నింపడం లేదని అసంతప్తి తెలియజేశారు. అలాగే రోగి ఆరోగ్య పరిస్థితిని కూడా వారితో మాట్లాడి కౌన్సెలింగ్ చేసి మందులు సక్రమంగా వాడేవిధంగా ప్రోత్సాహించాలని ఆదేశించారు. కౌన్సిలింగ్ విభాగంలో వైద్య విద్యార్థులను కూడా భాగసామ్యులను చేయాలని కోరారు. టీబీ రోగులకు అందరికీ కూడా హెచ్‌ఐవి పరీక్షలు తప్పనిసరి అని టీబీ, మెడికల్, సర్జికల్, హెచ్‌ఐవి యూనిట్‌లు సమన్వయంతో పనిచేసేలాగా, హెచ్‌ఐవి టీబీసేవలు అవసరమున్న ప్రతిఒక్కరికి అందేవిధంగా సమన్వయపరచుకొని సేవలందించాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. క్యాన్సర్ సేవలు, ఎన్‌సిడి సేవలను ముమ్మరం చేయవలసినదిగా ఆదేశించారు. అనంతరం ఎఆర్‌టి సెంటర్‌ను పరిశీలన చేసి వివరాలు తెలుసుకున్నారు. అపోలో ఆసుపత్రి వారి నిర్వహణలో ఎఆర్‌టి సెంటర్‌ను ప్రారంభించారు. సోషల్ ప్రమోట్ విభాగాధిపతులను ఎఆర్‌టి సెంటర్‌ను తరచుగా పరిశీలించాలని తెలిపారు. స్పెషల్ సెక్రటరీతో పాటు ఎఆర్‌టి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్, నాయక్, పిఇపి ఫార్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బాబురాజేంద్ర, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










