Jul 14,2023 18:45

ప్రజాశక్తి - ఉండి
తమ గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బి రహదారికి మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను వాండ్రం గ్రామస్తులు వేడుకుంటున్నారు. వాండ్రం గ్రామం వెళ్లాలంటే సప్తసముద్రాలు దాటినట్లు అవుతోందని వాపోతున్నారు. వచ్చే మార్చి నాటికి ఏ రోడ్డు చూసినా గుంతలు లేకుండా చూస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటన నేటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి నుంచి వాండ్రం వరకూ ఆర్‌అండ్‌బి రోడ్డు అత్యంత దారుణంగా అడుగుకో గుంత మారిందని, దీంతో రోడ్డంతా అస్తవ్యస్తంగా ఉందని రోడ్డు పొడవునా ఉన్న గుంతల్లోకి వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని, రాత్రిపూట ఆదమర్చి వాహనాన్ని నడిపితే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం భయంగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇటీవల ఆ గుంతల్లో పడి కొందరు కాళ్లూ, చేతులూ విరగ్గొట్టుకున్న సంఘటనలు చాలా జరిగాయి. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అంబులెన్స్‌ కూడా రావడానికి ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందని, ఊర్లోని కొంతమంది దాతలు వారి కంపెనీలకు వెళ్లే వరకూ రోడ్లు వారే వేసుకున్నారని తెలిపారు. ఈ రహదారి నిర్మించాలని ఎవరైనా అడిగితే వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఆపుతారని భయంతో ఎవరు ఏం చేయలేకపోతున్నామని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. కనీసం ఈ రోడ్డు పునర్నిర్మాణం చేపట్టకపోయినా పరవాలేదు గాని మరమ్మతులు చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ అధికారుల కోసం రోజుల తరబడి తిరిగినా ప్రయోజనం లేకపోయిందని అధికారులు అందుబాటులో ఉండటం లేదని పలువురు చెబుతున్నారు.