Jul 31,2022 21:32

హెల్మెట్‌ధారణపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టండి
రోడ్డు ప్రమాదాలు తగ్గించండి: జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

హెల్మెట్‌ధారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా శిక్షణాకేంద్రంలోని సమావేశం మందిరంలో నేర సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచే విధంగా ప్రత్యేక కార్యాచరణాలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్ఫోర్స్మెంట్‌ను అమలుపరచాలన్నారు. అదేవిధంగా రోడ్డుభద్రతకు సంబంధించి ముఖ్యంగా హెల్మెట్‌ ధారణ, డ్రంకెన్‌డ్రైవ్‌ విషయంలో గట్టిగా పనిచేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో ప్రత్యేక చొరవ చూపాలని, రోడ్డు భద్రత ప్రజలకే కాదు మనకు వర్తిస్తుందని కావున రోడ్డు మీద డ్యూటి చేయునప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎర్రచందనం కేసులపై ఎర్రచందనం అక్రమరవాణ అరికట్టడంలో నాన్‌బైలబుల్‌ వారంట్స్‌ (ఎన్‌బిడబ్ల్యూ)ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని, పెండింగ్‌లో ఉన్న యుఐ, పిటి గ్రేవ్‌ కేసులు, హత్యలు, మిస్సింగ్‌ కేసులు, దోపిడీలు, దొంగతనాలు, తదితర కేసులను లోతుగా సమీక్ష చేశారు. కేసులను త్వరిత గతిలో నేర పరిశోధన చేసి పరిష్కరించవలసినదిగా ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ కేసుల్లో పురోగతిపై సమీక్ష చేశారు. జిల్లాలోని వివిధ స్టేషన్‌లలో పలు కేసులలో స్వాధీనం చేసుకొన్న వాహనాలు పేరుకుని పోయి ఉన్నాయని వాటిని త్వరిత గతిన క్లియర్‌ చేయాలని ఆదేశించారు. పక్క రాష్ట్రాల నుండి మద్యం రవాణాపై ప్రతేక బందాలతో నిఘా పెట్టామని, జిల్లాలోని నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యురో, పోలీసు బందాలతో మెరుపు దాడులు చేసి మూలాలతో పెకిలించే ప్రయత్నం చేయాలన్నారు. నిఘా, సమాచార వ్యవస్థ ను పటిష్ట పరిచి, వాహనాల తనిఖీలు ఉదతం చేయాలని, జిల్లాలో ఎక్కువ ఎర్రచందనం, మద్యం, ఇసుక అక్రమ రవాణా కేసులున్న వారిపై పిడి యాక్టు ప్రయోగించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గురించి వివరిస్తూ ప్రతి సోమవారం నిర్వహించే ఈకార్యక్రమంలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులు, విన్నపాలను దానికి నిర్దేశించిన కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా, మర్యాదగా మసలుకోవాలని, మన ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలని, స్టేషన్‌పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని ఆదేశించారు. అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ పి.జగదీష్‌, అడిషనల్‌ ఎస్‌పి ఆపరేషన్స్‌ శ్రీనివాస రావు, ఎస్‌బి డిఎస్‌పి శ్రీనివాసరెడ్డి, 3 సబ్‌డివిజన్‌ పోలీసు అధికారులు డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్‌ శరత్‌చంద్ర, సర్కిల్‌ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐ పాల్గొన్నారు.