Aug 09,2022 22:40

చెరువులో రంగు నీళ్లు

నూలు కంపెనీకి అంచుల్లో 'డైట్‌'
పశువుల్లోనూ ప్రబలుతున్న వ్యాధులు
ప్రజాశక్తి - కార్వేటినగరం

నూలుకు రంగు అందమే.. అయితే అదే రంగు మనుష్యుల, పశువుల ప్రాణాలు తీస్తోంది.. వింతవింత వ్యాధులకు కారణమవుతోంది.. కార్వేటినగరం పంచాయతీ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్‌)కు కూతవేటు దూరంలోని రెడ్డిండ్లు గ్రామంలో నాలుగేళ్ల క్రితం లుంగీలు తయారు చేసి, రంగులు అద్దే ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. నిత్యం అధిక సంఖ్యలో రంగులు అద్దుతుంటారు. ఈ రంగు నీళ్ల నిల్వ కోసం ఫ్యాక్టరీ యాజమాన్యం పొలంలోనే రెండు ఇంకుడు గుంతలను తవ్వించుకుంది. ఆ గుంటల్లో నీలిరంగు పుష్కలంగా నిల్వ ఉంది. ఈ నీరు భూమిలో ఇంకడంతో చుట్టుపక్కల బోర్లు, కుళాయిల్లో ఇంకి తాగునీరు కలుషితమవుతోంది. గత కొంతకాలంగా పశువులకు జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. లక్షలు వెచ్చించి కొన్న పశువులకు జీర్ణకోశ వ్యాధులతో రెండు రోజులకోసారి వేలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజలు రొమ్ముక్యాన్సర్‌, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై యాజమాన్యాన్ని జనం ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగుతున్నారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు.
రంగునీళ్ల ఫ్యాక్టరీకి కూతవేటు దూరంలో డైట్‌ ఉంది. ఇందులో 200 మంది ఛత్రోపాధ్యాయులు, మోడల్‌ యూపీ పాఠశాలలో 110 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కశవరాజుకుంట యానాదికాలనీ, తూర్పు అరుంధతివాడ, గొల్ల ఇండ్లు, చాకలవాణి గుంట యానాది కాలనీలు ఉన్నాయి. ఈ రంగు నీళ్లు భూమిలో ఇంకితే వేల సంఖ్యలో ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. పర్యావరణ అధికారులు సందర్శించి రంగు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో రంగునీళ్ల కాలుష్యాన్ని చూసి నివారణా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రొమ్ము నొప్పితో బాధపడుతున్నాం : సరోజమ్మ, రెడ్డిండ్లు
గత నాలుగు సంవత్సరాలుగా మా ఇళ్ళ వద్ద తమిళనాడుకు చెందిన వారు నూలుకు రంగులద్దే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అందులో నుంచి బయటకు వచ్చే వ్యర్ధ రంగునీళ్లు భూగర్భంలో కలుస్తున్నాయి. ఈ నీళ్లు తాగడం వల్ల రొమ్ము, కాళ్లు నొప్పులు, జ్వరం వంటి వ్యాధులు వస్తున్నాయి.
కొళాయిల్లో రంగునీళ్లు :రామయ్య, రెడ్డిండ్లు
నూలుకు రంగులు అద్దె ఫ్యాక్టరీ ఇళ్ళ పక్కనే ఉండడం వల్ల తాగు నీటి కొళాయి లలో వచ్చే నీళ్ళు రంగు నీళ్ల గా మారింది. దానిని సేవించడం వల్ల నాకు కీళ్ల నొప్పులు, పశువులకు ఉదరకోశ వ్యాధి వస్తుంది. వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళుతున్నాం.