
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : యువత దేశరక్షణ రంగంలో భాగస్వామ్యలయ్యేలా వారు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేలా వారిని అన్నివిధాలుగా సంసిద్ధులుగా తయారు చేయిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బి.వి.రమణ సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని విజయనగరం పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌పి టి.ఆనందబాబు కొనియాడారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మాతదేవోభవ స్వచ్ఛంద సంస్థ, ఎన్‌విఎన్ బ్లడ్‌బ్యాంకు ఆధ్వర్యాన ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల అగ్నిపథ్ ఫలితాల్లో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థకు చెందిన 82 మంది ఎంపిక కావడం, వారికి ఆ విధంగా శిక్షణ అందించి ఉద్యోగాలు సాధించేలా కృషి చేసిన రమణ సేవలను కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు. అనంతరం దుశ్శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో విజయనగరం సైనిక్ వెల్ఫెర్ ఆఫీసర్ మజ్జి కృష్ణారావు, లోక్‌సత్తా పూర్వ వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జి, మాజీ ఎన్‌ఎస్‌జి అనీల్ పాల్గొన్నారు.