- ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.
ప్రజాశక్తి-రాయదుర్గం : మాజీ మంత్రి, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తనపై విసిరిన చాలెంజ్ సవాలు స్వీకరణకు తాను సిద్ధంగా ఉన్నానని రాయదుర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం శ్రీనివాసులు విసిరిన సవాల్ కు ఆదివారం కాపు ఒక ప్రకటన ద్వారా స్పందించారు. కాలవ సూచించినట్లు మలపనగుడి గ్రామం అయినా నేమకల్లు అయినా లేదా రాయదుర్గం నియోజకవర్గం లోని ఏ గ్రామంలోనైనా కాలువతో పాటు తాను గడపగడపకు వెళ్లి ప్రజలకు ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వల్ల అధిక లబ్ధి చేకూరిందో తేల్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను పోలీసులను, కానీ గన్మెన్లను కానీ వెంటబెట్టుకు రానని, అయితే వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, తమ పార్టీ కార్యకర్తలతో గడపగడపకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శ్రీనివాసులు కూడా తమ జన్మభూమి కమిటీ సభ్యులతో గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ప్రజలకు ఎవరికి ఎంత లబ్ధి చేకూరిందో తెలుపుతూ జాబితాతో సిద్ధంగా రావాలని పిలుపునిచ్చారు. గతంలో తాను పలుసార్లు ఇదే విషయాన్ని సవాలు చేసినప్పటికీ ఏనాడు స్పందించని శ్రీనివాసులు శనివారం మీడియా ద్వారా తనకు చాలెంజ్ చేసిన విషయం దృష్టికి వచ్చిందన్నారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాలువ కూడా సిద్ధంగా ఉంటే ఎవరి హయాంలో అధిక లబ్ది చేకూరిందో ప్రజలకు తెలియజేద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అధిక లబ్ధి చేకూరి ఉంటే తమ పార్టీని ఆదరించమని ప్రజలను తాను కోరుతామన్నారు. కాల్వ శ్రీనివాసులు వారి ఐదేళ్ల టిడిపి పాలనలో కంటే వైకాపా ప్రభుత్వ పాలనలో అధిక లబ్ధి చేకూరి ఉంటే వైకాపాకే ఆదరించమని ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు.










