Sep 24,2023 23:35

బి.శాంతిశ్రీ, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌

* పౌష్టికాహారం సక్రమంగా అందించడమే లక్ష్యం
* అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ
* ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శాంతిశ్రీ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ మంచి ఫలితాలు ఇస్తోందని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి బగాది శాంతిశ్రీ అన్నారు. ప్రధానంగా మహిళల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందించాలంటే ఆరోగ్య వంతమైన జీవనం అవసరం అన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా ప్రజలకు అందించడమే సమగ్ర మహిళాభివృద్ధి శాఖ లక్ష్యమని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా ప్రతి కార్యకర్తా కేంద్రల ద్వారా అందించాల్సిన సేవలను క్రమం తప్పకుండా ఉండేదందుకు కృషి చేస్తున్నాట్టు చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టయితే వాటిని సరిదిద్దడానికి అధ్యయనం చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆ దిశగా శాఖా పరమైన చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. జిల్లాలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆమె క్షేత్ర స్థాయిలో పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు 'ప్రజాశక్తి' వివరించారు.
జిల్లాలో ఐసిడిఎస్‌ ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
జిల్లాలో సమగ్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ పరిధిలో 16 ప్రాజెక్టుల ద్వారా సేవలు అందిస్తున్నాం. వాటి పరిధిలో 3,358 కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 11,480 మంది గర్భిణులకు, 11,952 మంది బాలింతలకు, 79,871 మంది చిన్నారులకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. వారి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అందిస్తున్నాం. పాలనా పరమైన సంస్కరణలు తప్ప పథకం అమలులో ఎలాంటి మార్పులు లేవు. మహిళల ఆరోగ్యంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం.
ఆరోగ్యంగా వారుండేందుకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా తల్లులకు, పిల్లలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించడంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పథకాల అమలుపై శ్రద్ధ చూపుతున్నాం. మాతా శిశు మరణాలతో పాటు తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గడమే ప్రధాన లక్ష్యం. చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ (గ్రోత్‌ మానిటరింగ్‌) చేస్తున్నాం. క్షేత్ర స్థాయి తనిఖీలు పెంచడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లోని కేంద్రాలపై మరింత నిశిత పరిశీలన చేపట్టనున్నాం.
గర్భిణులకు, చిన్నారులకు రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాక్సినేషన్‌ ఎలా సాగుతోంది?
జిల్లాలో గర్భిణులకు, చిన్నారులకు క్రమం త్పకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న వెల్‌నెస్‌ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు సమన్వయంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్‌ శాఖల మధ్య నివేదికల్లో తేడాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలి. వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించి శతశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. ప్రతినెలా మాసాంతానికి ఈ నివేదికలు పంపించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వం రూపొందించిన యాప్‌ల్లో ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. అలసత్వం ఉన్న వారిపై చర్యలు తప్పవు.
సరకుల సరఫరాలో అక్రమాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ప్రతినెలా 5లోగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ జరుగుతోంది. కొన్నిసార్లు జాప్యం జరిగినా తదనంతరం సరఫరా చేపడుతున్నారు. పాలు, గుడ్లు సరఫరాలో ఎక్కడా లోపాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి తోడు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, ఫోషణ ఫ్లస్‌ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. లబ్ధిదారులకు నేరుగా పోషకాహారం అందించడం జరుగుతోంది. ఏ ఒక్క లబ్ధిదారులకూ సరకులు అందలేదన్న ఫిర్యాదులు రాకుండా పేస్‌యాప్‌, థంబ్‌ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్రమం తప్పకుండా కార్యకర్తలు, సిబ్బంది నుంచి కేంద్రాల్లో ముఖ హాజరు తీసుకుంటున్నాం.