
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి- ఎచ్చెర్ల: రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక పిలుపునిచ్చారు. మీరు చేసే రక్త దానం వల్ల అనేకమంది పేద వారు ప్రాణాలు కాపాడుగలరని స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా ఆర్డ్మ్ రిజర్వ్ పోలీస్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యాన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు, జిల్లా సర్వజనాస్పత్రి ఆధ్వర్యాన రక్తదానం శిబరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, రక్తదాన శిబిరాల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా పోలీసు ఉద్యోగులకు ఏర్పాటు చేశామని అన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ స్థాయిలోనూ నిర్వహిస్తున్నామని తెలిపారు. అమర వీరుల త్యాగాలు గుర్తుగా సిబ్బంది రక్త దానం చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఉద్యోగులందరికీ ఉచితంగా ఇసిజి, సుగర్, బి.పి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావు, పోలీసు యూనిట్ డాక్టర్ సిహెచ్.విజయకుమార్, మెడికవర్ ఆస్పత్రి వైద్యులు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు విభాగం ఆర్‌ఐలు ఉమ మహేష్, డి.సురేష్ పాల్గొన్నారు.
మహర్షి వాల్మీకి జీవితం నేటికీ ఎంతో ఆదర్శనీయమని ఎస్‌పి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వాల్మీకి మహర్షి సమాజానికి అందించిన మహా కావ్యం రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలు పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావు, డిఎస్‌పిలు కె.బాలరాజు, వై.శృతి, జి.నాగేశ్వరరెడ్డి, డి.బాలచంద్రారెడ్డి, జి.వి.ప్రసాద్, వాసుదేవ్, విజయకుమార్, ఎఒ గోపీనాథ్ పాల్గొన్నారు.
పలాస : రక్తదానం వలన మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పోలీసు వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో రక్తదానం, మెగా వైద్యశిబిరం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రక్తదాన శిబిరాన్ని డిఎస్‌పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏడాదిలో రెండుసార్లు రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. వారిచ్చిన రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలను నిలబెడుతుందన్నారు. ఈ శిబిరంలో 57 మంది రక్తదానం చేశారు. అనంతరం సుమారు 220 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో కాశీబుగ్గ ఇన్‌ఛార్జి సిఐ రవిప్రసాద్, కాశీబుగ్గ ఎస్‌ఐ ఖాధర్ భాషా, వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.